గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య.. విమానం బెంగళూరుకు దారి మళ్లింపు

by Kema Shiva Kumar |

గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తడం, వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో ఫ్లై 91 విమానాన్ని పైలట్లు దారి మళ్లించారు.

గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య.. విమానం బెంగళూరుకు దారి మళ్లింపు
X

దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి హుబ్లి వెళ్లాల్సిన ఫ్లై 91 విమాన ప్రయాణికులకు చుక్కెదురైంది. విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యలు తలెత్తడం, దానికి తోడు హుబ్లిలో వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సూచనల మేరకు విమానాన్ని సురక్షితంగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. తొలుత విమానాన్ని హుబ్లిలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురైంది. దీంతో రిస్క్ తీసుకోకూడదని భావించిన విమాన సిబ్బంది, సమీపంలోని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ప్రయాణికుల అవస్థలు..

విమానం హుబ్లిలో కాకుండా బెంగళూరులో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే సాంకేతిక లోపం దృష్ట్యా భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విమానయాన సంస్థ తెలిపింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించింది.

Next Story