Tarrifs: ఈయూ కీలక నిర్ణయం.. అమెరికాపై 90 రోజుల పాటు టారిఫ్స్ నిలిపివేత

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను విధించిన పరస్పర సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Tarrifs: ఈయూ కీలక నిర్ణయం.. అమెరికాపై 90 రోజుల పాటు టారిఫ్స్ నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాను విధించిన పరస్పర సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ (EU) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాపై విధించే ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఈ మేరకు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ( Ursula von der Leyen) ఓ ప్రకటన విడుదల చేశారు. ‘టారిఫ్స్ ఆపివేస్తున్నట్టు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను మేం గమనించాం. కాబట్టి ఈ విషయంలో చర్చలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతీకార సుంకాలను సైతం 90 రోజుల పాటు నిలిపివేస్తాం’ అని తెలిపారు. చర్చలు సంతృప్తికరంగా లేకపోతే ప్రతిఘటన చర్యలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు.

కాగా, ఏప్రిల్ 9న ఈయూపై ట్రంప్ 25 శాతం సుంకాలను విధించారు. దీంతో దానికి బదులుగా టారిఫ్స్ విధించాలని ఈయూ నిర్ణయించింది. కానీ ట్రంప్ యూటర్న్ తీసుకోవడంతో ఈయూ సైతం అందుకు అంగీకరించింది. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ (Mark carney) సైతం ట్రంప్ యూటర్న్ ను స్వాగించారు. ఏప్రిల్ 28న ఎన్నికల తర్వాత తాము అమెరికాతో కొత్త ఆర్థిక ఒప్పందంపై చర్చలు ప్రారంభిస్తామన్నారు. అలాగే అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్టు వియత్నాం తెలిపింది.

Next Story