అది డబుల్ కాదు.. 'ట్రబుల్ ఇంజిన్' ప్రభుత్వం.. స్టాలిన్ సర్కార్‌పై తమిళిసై ఫైర్

by Ramesh Naini |

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని సర్కార్‌ను ఆమె 'ట్రబుల్ ఇంజిన్' ప్రభుత్వంగా అభివర్ణించారు.

అది డబుల్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. స్టాలిన్ సర్కార్‌పై తమిళిసై ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని సర్కార్‌ను ఆమె 'ట్రబుల్ ఇంజిన్' ప్రభుత్వంగా అభివర్ణించారు. శనివారం చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తుంటే, తమిళనాడు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుందని ఎద్దేవా చేశారు. ‘దేశవ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వాలు 'డబుల్ ఇంజిన్' వేగంతో, కొన్ని చోట్ల స్థానిక సంస్థల విజయాలతో 'ట్రిపుల్ ఇంజిన్' ప్రభుత్వాలుగా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. కానీ, తమిళనాడులో మాత్రం 'ట్రబుల్ ఇంజిన్' పాలన సాగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గాడి తప్పింది. ప్రజలకు అందాల్సిన పథకాలు పూర్తిస్థాయిలో చేరడం లేదు’ అని తమిళిసై విమర్శించారు.

తమిళిసై జోస్యం..

రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా అసంతృప్తితోనే ఉందని ఆమె పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం సమ్మెలు, ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరించలేక, ప్రతీదానికి కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, స్టాలిన్ నేతృత్వంలోని ఈ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ ఆగిపోవడం ఖాయమని తమిళిసై జోస్యం చెప్పారు.

Next Story