Tamil Nadu: లైంగికదాడి కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పై వేటు

by Shamantha N |

లైంగికదాడి కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడులోని మైలాడుదురై జిల్లా కలెక్టర్ పై వేటు పడింది.

Tamil Nadu: లైంగికదాడి కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పై వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగికదాడి కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడులోని మైలాడుదురై జిల్లా కలెక్టర్ పై వేటు పడింది. కలెక్టర్ మహాభారతిని(Mahabharathi) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఈరోడ్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్‌ఎస్ శ్రీకాంత్‌ను నూతన కలెక్టర్‌గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. బాలల భద్రతపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మహాభారతి రేప్ కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి కేసుల్లో అధికారులు రెండువైపులా ఆలోచించాలని అన్నారు. బాలిక అతడిపై ఉమ్మేయడంతోనే ఆగ్రహానికి గురై లైంగిక వేధింపులకు గురిచేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో దుమారం రేగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కలెక్టర్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఉన్నతస్థానంలో ఉన్న అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం కలెక్టర్ పై విమర్శలు గుప్పించారు.

కేసు ఏంటంటే?

మైలాడుదురై జిల్లా సీర్గాళిలో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన మూడున్నరేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడంతోపాటు హత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన బాలుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలుడు చిన్నారి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో, అతడు పక్కనే ఉన్న ఇటుకతో ఆమె తల, ముఖంపై కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story