Tamilanadu: 1,000 కిలోల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం

by S Gopi |

ఈ బంగారు కడ్డీలను గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో జమ చేశారు.

Tamilanadu: 1,000 కిలోల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఉండే బంగారానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 21 ఆలయాల్లో భక్తులు సమర్పించే, విరాళంగా అందించిన, నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోల బంగారాన్ని కరిగించి 24 క్యారెట్ల బంగారు కడ్డీలుగా మార్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బంగారు కడ్డీలను గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో జమ చేశారు. దీని ద్వారా వార్షిక వడ్డీ కింద రూ. 17.81 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ముంబైలోని ప్రభుత్వ మింట్‌లో బంగారం కరిగించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ పెట్టుబడి ద్వారా వచ్చిన వడ్డీ మొత్తాన్ని ఆలయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్(హెచ్ఆర్ అండ్ సీఈ) మంత్రి పీకే శేఖర్ బాబు తమిళనాడు అసెంబ్లీలో విధానపరమైన పత్రాలను సమర్పించారు. ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి రిటైర్డ్ జడ్జీలతో మూడు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కరిగించిన బంగారంలో అత్యధికంగా 424.26 కిలోలు తిరుచిరాపల్లి జిల్లాలోని సమయపురంలో ఉన్న అరుల్మిగు మరియమ్మన్ ఆలయం నుంచి సేకరించారు. ఈ ఏడాది మార్చి నాటికి 21 దేవాలయాల నుంచి సేకరించిన మొత్తం బంగారం 10,74,123.488 గ్రాములు ఉన్నట్టు ప్రభుత్వం సమర్పించిన నోట్‌లో పేర్కొన్నారు.

Next Story