- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు లాకప్ డెత్ కేసు.. పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెల్లడి
తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న పోలీస్ కస్టడీ మరణం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే మృతిచెందిన యువకుడు అజిత్ కుమార్ (25) పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న పోలీస్ కస్టడీ మరణం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే మృతిచెందిన యువకుడు అజిత్ కుమార్ (25) పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అతని శరీరంపై మొత్తం 44 గాయాలు ఉన్నట్లు పోస్టు మార్టం రిపోర్టు వెల్లడించింది. ఇందులో పలుచోట్ల తీవ్ర గాయాలు కాగా, హృదయం, కాలేయం వంటి అంతర్గత అవయవాల్లో కూడా తీవ్ర రక్తస్రావం జరిగినట్టు స్పష్టమైంది. ఈ గాయాలు ప్రధానంగా రాడ్లు, లాఠీలు వంటి కఠినమైన వస్తువులతో కొట్టడం వల్ల వచ్చి ఉంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కస్టడీలో ఉన్నప్పుడు అతడు తీవ్రమైన హింసకు గురైనట్లు తెలుస్తోంది.
అజిత్ కుమార్‌ను అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు అతనిపై దారుణంగా దాడి చేసినట్టు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవహక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ఇటీవల శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని మాదపురం కాళీఅమ్మన్ ఆలయానికి మహిళ కారులో వచ్చింది. అక్కడే పని చేస్తున్న ఆలయ గార్డు అజిత్ కుమార్‌కు తాళాలు ఇచ్చి పార్కు చేయమని చెప్పింది. అయితే అతడికి కారు నడపడం చేతకాకపోవడంతో మరొకరి సహాయం తీసుకున్నాడు. అయితే దర్శనం అనంతరం కారు తీసుకెళ్తుండగా కారులో 80 గ్రాముల బంగారు ఆభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో జూన్ 27న అజిత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ విచారణలో అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కొట్టడం వల్లే అజిత్ ప్రాణాలు పోయాయంటూ ఆరోపించారు. మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు మాత్రం.. అజిత్ కుమార్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు వెల్లడించారు. ఆభరణాలు దాచి పెట్టిన చోటికి తీసుకెళ్లినప్పుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మూర్ఛ వ్యాధితో మరణించినట్లు చెప్పుకొచ్చారు. విచారణలో అనేక పేర్లు చెప్పాడని.. చివరికి అతడే నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినప్పటికీ.. మద్రాస్ హైకోర్టు(Madras High Court) బెంచ్ స్వయంగా జోక్యం చేసుకుని సస్పెన్షన్ సరిపోదని, కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడింది. ఇక ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించింది.






