Tamilanadu: బడ్జెట్‌లో అధికారిక రూపాయి సింబల్‌ను తొలగించిన తమిళనాడు ప్రభుత్వం

by S Gopi |

ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి

Tamilanadu: బడ్జెట్‌లో అధికారిక రూపాయి సింబల్‌ను తొలగించిన తమిళనాడు ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికే జాతీయ విద్యా విధానంపై కేంద్రంతో తగువుకు దిగిన తమిళనాడు ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వ బడ్జెట్ నుంచి అధికారిక రూపాయి చిహ్నాన్ని(₹) తొలగించింది. దాని స్థానంలో తమిళ లిపిలో రూపాయి అర్థం వచ్చే అక్షరాన్ని ఉంచింది. దీంతో ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి అయింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నెలకొన్న తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరినట్టు అయింది. ఈ మార్పులు తమిళనాడు వ్యాప్తంగా వివిధ సంఘాలు స్వాగతించగా, డీఎంకె ప్రభుత్వ తీరును బీజేపీ విమర్శించింది. బీజేపీ తమిళనాడు విభాగం చీఫ్ అన్నామలై దీని గురించి మాట్లాడుతూ.. 2025-26 బడ్జెట్‌లో డీఎంకె ప్రభుత్వం తొలగించిన రూపాయి చిహ్నం ఒక తమిళవ్యక్తి రూపొందించినదని, దీన్ని మొత్తం భారత్ స్వీకరించింది. తమిళుడు రూపొందించిన రూపాయి చిహ్నాన్ని డీఎంకె విస్మరిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడం స్టాలిన్ మూర్ఖత్వమని మండిపడ్డారు. అయితే, పలు తమిళ సంఘాలు మాత్రం ఇది మాతృభాషను రక్షించే చర్య అని అభిప్రాయపడ్డాయి.

కాగా, 2009, మార్చి 5న భారత ప్రభుత్వం అధికారికంగా భారత రూపాయి చిహ్నం కోసం పోటీని ప్రకటించింది. అనంతరం 2010, జూలై 15న అధికారికంగా ఆమోదించింది.తమిళనాడుకు చెందిన డి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఈ కొత్త రూపాయి చిహ్నాన్ని రూపొందించారు. ఉదయ్ కుమార్ దేవనాగరి అక్షరం 'ఆర్, ఆంగ్ల అక్షరం 'R' రెండూ కనిపించేలా డిజైన్(₹) చేశారు. పైన ఉండే రెండు రేఖలు భారతీయ త్రివర్ణ పతాకాన్ని, ఆర్థిక అసమానతను తగ్గించాలనే కోరికను సూచించేలా సమానత్వాన్ని కూడా సూచిస్తుంది.

Next Story