- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stampedes: హత్రాస్ టు మహాకుంభమేళ.. దేశాన్ని ముంచేసిన విషాదకర ఘటనలు
Stampedes: కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్ రాజ్ కు భక్తులు పోటెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: Stampedes: కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్ రాజ్ కు భక్తులు పోటెత్తారు. దీంతో బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.దాదాపు 100 మందికిపైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. మన దేశంలో గతంలో కూడా పర్వదినాలు, మేళాల సందర్భంగా పలుమార్లు దుర్ఘటనలు ఎన్నో జరిగాయి. కొన్ని సందర్భాల్లో దాదాపు 200 మందికిపైగా మరణించిన ఘటనలూ ఉన్నాయి. అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ప్రమాదాలు మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా వదంతులు, భక్తుల్లో భయాలు, కొందరు నాయకుల అత్యుత్సాహం వంటి వాటివల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార యంత్రాంగం ఆయా కార్యక్రమాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో చోట వదంతులు, భక్తుల్లో భయాలు, అత్యుత్సాహాలు ఈ ఘటనలకు కారణం అవుతున్నాయి. దేశంలో గతంలో జరిగిన విషాద ఘటనలను ఓసారి చూసినట్లయితే..
గత కుంభమేళాల్లో సైతం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1954లో తొలి కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీన జరిగిన తొక్కిసలాట దేశ చరిత్రలోనే పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2వేల మంది గాయపడ్డారు. అది కూడా మౌని అమావాస్య రోజు జరగడం గమనార్హం. నాడు ఒక ఏనుగు అదుపుతప్పి దూసుకురావడంతో ఈ ఘటన జరిగినట్లు కథనాలు చెబుతున్నాయి.
1986 ఏప్రిల్ 14:
1986 ఏప్రిల్ 14వ తేదీన మహాకుంభమేళా సందర్బంగా నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ తనతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులను తీసుకుని హరిద్వార్ కు స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రద్దీని నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 200 మంది మరణించారు.
2003 కుంభమేళా
2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్ లో గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలు అక్కడికి వచ్చారు. వేలాది మంది యాత్రికులు గుమిగూడారు. అప్పుడే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి డజన్ల కొద్దీ మంది భక్తులు మరణించారు. ఈ తొక్కిసలాటో మహిళలు సహా 39 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 100 మందికి పైగా గాయపడ్డారు.
2013 అలహాబాద్ కుంభమేళా:
సరిగ్గా 12సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశలోని నాటి అలహాబాద్ లో తోపులాట జరిగింది. 2013 ఫిబ్రవరి 10వ తేదీన కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్ లో యాత్రికుల రద్దీ కారణంగా ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ విషాద ఘటనలో 42 మంది మరణించారు. మరో 45 మందికి గాయాలయ్యాయి.
2015 జులై 14న గోదావరి పుష్కరాలు
2015 జులై 14వ తేదీన గోదావరి పుష్కరాలు జరిగాయి. మహాపుష్కరాలు పేరుతో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు పుష్కరస్నానం ఆచరించి సుమారు రెండు గంటలపాటు ఘాట్లో ఉండటంతో పుష్కర ఘాట్ జనసంద్రమైంది. ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
హాథ్రస్ లో భోలేబాబా సత్సంగ్
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో 2024లో భోలేబాబా సత్సంగ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్ రాయ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. బాబా పాదాల దగ్గర ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది.
నవరాత్రి వేళ రత్నఘడ్
2013 అక్టోబర్ 13వ తేదీన మధ్యప్రదేశ్ లోని రత్నఘడ్ మందిరంలో నవరాత్రి సందర్భంగా జరిగిన తోపులాటలో 115 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. లక్షలాది మంది భక్తులు గుమిగూడిన రతన్ ఘర్ లోని సింధ్ నదిపై ఉన్న వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. ఇది కూలిపోతుందన్న పుకార్ల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.
చాముండేశ్వరీదేవి ఆలయం
రాజస్థాన్ లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న తొక్కిసలాట జరిగింది. దీనిలో 224 మంది మరణించారు. 420 మందికిపైగా గాయపడ్డారు. బాంబు పేలుడు భయమే ఈ ప్రమాదానికి కారణమని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.
హిమాచల్ ప్రదేశ్
2008లో హిమాచల్ ప్రదేశలోని నయనాదేవి ఆలయంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో 145 మంది ప్రాణాలు కోల్పోయారున. కొండచరియలు విరిగిపడుతున్నాయన్న వదంతులే దీనికి కారణమని అధికారులు గుర్తించారు.
మహారాష్ట్ర మంధరదేవి
2005లో మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాడు ఆలయానికి వెళ్లే మెట్లుజారుడుగా ఉండటంతో ఒక్కసారిగా జనం ఒకరిపైకిమరొకరు పడ్డారు. ఈ సందర్భంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
* 2024లో ఉత్తరప్రదేశ్ లోని మధురలోని శ్రీజీ ఆలయంలో హోలీకి ముందు జరిగిన కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6 భక్తులు స్ప్రుహ తప్పి పడిపోయారు.
* 2023లో మధురలోని ఓ ఆలయంలో కిక్కిరిసిన జనం రావడంతో ఊపిరాడక ఇద్దరు మహిళా భక్తులు మరణించారు. యూపీలోని మధురలోని బాంకే బిహారీ ఆలయంలో ఈ ఘటన జరిగింది.
* 2022లో జమ్మూ కాశ్మీర్ లో ని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి పుణ్యరక్షేత్రంలో భక్తుల రద్దీకారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణంచారు. దాదాపు 15 మంది గాయపడ్డారు.
* 2019లో తమిళనాడులోని తిరుచ్చి ఆలయ ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో 7గురు భక్తులు మరణించారు. తిరుచ్చి ముత్తయంపాళయం గ్రాయంలోని కరుప్పస్వామి ఆలయంలో చిత్ర పౌర్ణమి పండగ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగింది.
* 2014 మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలోని ఓ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో పుకారు కారణంగా 10మంది మరణించారు. 20మందికిపైగా గాయపడ్డారు. చిత్రకూట్ లోని కమతా నాథ్ ఆలయానికి సమీపంలోని కొండపై యాత్రికులు పరిక్రమ చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది.
* 2012 నవంబర్ 19వ తేదీన బీహార్ లోని పాట్నాలో గంగానది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ దగ్గర చాట్ పూజ సమయంలో వంతెన కూలి 20 మంది భక్తులు మరణించారు.
* శబరిమల తొక్కిసలాట
2011 కేరళలోని ఇడుక్కి జిల్లాలోని శబరిమల పుణ్యక్షేత్రంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 104 మంది మరణించారు. 90మందికిపైగా గాయపడ్డారు.
2025 తిరుపతి వైకుంఠ ఏకాదశి
జనవరి 8వ తేదీ 2025 నాడు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. బైరాగిపట్టెడ దగ్గర ఈ దారుణం జరిగింది. ఇది తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం. భారీగా రద్దీ ఉండటంతో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ.. కానీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలూ సంభవించాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం గేట్లు తెరవగానే ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. రద్దీలో భక్తులు ఇరుక్కుపోయి ఊపిరాడక అల్లాడిపోయారు. ఈ విషాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా..వారిలో ఐదుగురు మహిళలే ఉండటం మరింత విషాదాన్ని నింపింది.
కాగా ఈసారి మహాకుంభ నిర్వాహకులు 113 అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరాలతో సహా అధునాతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించారు. దీనికోసం పోలీసులు ఉత్సవప్రదేశంలో దాదాపు 300 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓవర్ హెడ్ డ్రోన్స్ ను మోహరించారు. ఈ తరహా ఘటనలు భక్తులకు, అధికారులకు గుణపాఠంగా మారాలి. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావ్రుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






