Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షావేయని సుప్రీంకోర్టు!

by Shamantha N |

లైంగిక వేధింపుల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షావేయని సుప్రీంకోర్టు!
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద కోర్టు అధికారాల ద్వారా ఈ తీర్పు వెలువరించినట్లు జస్టిస్ అభయ్ ఎస్ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. బాధితురాలి ప్రస్తుత మానసిక పరిస్థితి, భావోద్వేగ శ్రేయస్సును పరిశీలించడానికి క్లినికల్ సైకాలజిస్ట్, సహా సామాజికవేత్తలతో గతంలోనే కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఆ రీసెర్చ్ తుది నిర్ణయంలో కీలక పాత్ర పోషించినట్లు ధర్మాసనం పేర్కొంది. "సమాజం ఆమెను జడ్జ్ చేసింది. న్యాయవ్యవస్థ ఆమెను ఫెయిల్ చేసింది. సొంత కుటుంబసభ్యులే ఆమెను విడిచిపెట్టింది" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నేరం జరిగినప్పుడు..

నేరం జరిగినప్పుడు 24 ఏళ్ల వ్యక్తి ఒక మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. అయితే, ఆమె మేజర్ అయ్యాక అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ జంటబిడ్డతో కలిసి నివసిస్తున్నారు. కాగా.. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు ఇప్పుడు మేజర్ అని.. ఈ ఘటనను ఆమె నేరంగా చూడలేదని కోర్టు పేర్కొంది. చట్టం ప్రకారం ఇది నేరమైనప్పటికీ.. బాలిక దీన్ని నేరంగా అంగీకరించలేదంది. అయితే, ఆమెకు గాయం కలిగించింది మాత్రం చట్టపరమైన నేరం కాదని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలే అని పేర్కొంది. ఆమె పోలీసులు, న్యాయవ్యవస్థ నుంచి నిందితుడ్ని కాపాడేందుకు నిరంతరం పోరాటం చేసిందంది. ఈ కేసు వాస్తవాలు అందరికీ కళఅలు తెరిపించేలా ఉన్నాయంది. నిందితుడి పట్ల బాధితురాలి భావోద్వేగ అనుబంధం, వారి ప్రస్తుత కుటుంబ జీవితంతో సహ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నామంది. బాధితురాలికి "పూర్తి న్యాయం" చేయడానికి ఆర్టికల్ 142 కింద అధికారాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే దోషికి ఎలాంటి శిక్ష విధించకుండా తీర్పు వెలువరించింది.

Next Story