- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పగలు ఫుడ్ డెలివరీ గర్ల్.. రాత్రి పోలీస్ అభ్యర్థిగా.. నెటిజన్లను కదిలిస్తున్న యువతి పోరాటం
ముంబైలో స్విగ్గీ డెలివరీ చేస్తూ రాత్రి వేళల్లో పోలీస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఘాజీపూర్ యువతి ఖుష్బూ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ సమాజంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. ఉన్న దాంట్లో నుంచి జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా నెట్టుకు వస్తామనేదే ముఖ్యం. తన కుటుంబ పరిస్థితులు సహకరించవని తెలిసినా తాను కలలుగంటున్న ఉద్యోగం సాధించుకునేందుకు ఓ యువతి చేస్తున్న పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. పగలంతా ముంబయి నగరంలో ఫుడ్ డెలివరీ గర్ల్ గా పని చేస్తూ.. రాత్రిపూట పుస్తకాలతో కుస్తీ పడుతోంది. తన గ్రామానికి వెళ్తే ఎలాగైనా సరే పోలీస్ యూనిఫామ్ లోనే తిరిగి వెళ్లాలనే ఏకైక సంకల్పంతో పట్టువదలకుండా శ్రమిస్తున్న 23 ఏళ్ల యువతి పోరాటాన్ని స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈవో రోహిత్ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న డెలివరీ భాగస్వాముల జీవిత విశేషాలు, వారి ఆశయాలను పంచుకునే "చాయ్ బిస్కూట్" సిరీస్‌లో భాగంగా రోహిత్ కపూర్ షేర్ చేసిన ఈ 23 ఏళ్ల డెలివరీ పార్ట్నర్ గురించిన వీడియో వైరల్‌గా మారి వేలాది మందికి స్ఫూర్తినిస్తోంది.
ఇంట్లో చెప్పకుండా ముంబయికి:
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ఖుష్బూ ప్రస్తుతం ముంబైలో స్విగ్గీ (Swiggy) డెలివరీ పార్ట్నర్‌గా పని చేస్తోంది. రోహిత్ కపూర్ తో జరిగిన సంభాషణలో ఖుష్బూ తన జీవింతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగం తన జీవిత లక్ష్యం కాదని యూపీ పోలీస్ (UP Police) ఉద్యోగాన్ని సాధించడానికి తన ఏకైక లక్ష్యం అని చెప్పుకొచ్చింది. తన ఇంట్లో ఐదుగురు తోబుట్టువులలో తాను ఒకదాన్ని. సొంతంగా ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించుకోవాలనే పట్టుదలతో కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఒంటరిగా ఘాజీపూర్ గ్రామం నుండి ముంబయికి వచ్చానని ఇక్కడ స్విగ్గీలో చేరుతూనే, మరోవైపు పోలీస్ పరీక్షల ప్రిపరేషన్‌కు కావాల్సిన ఖర్చులను తనే సమకూర్చుకుంటున్నానని తెలిపింది.
యూనిఫామ్‌లోనే ఊరికి వెళ్తా!
తాను ప్రతిరోజూ పడే కష్టం వెనుక ఒకే ఒక ఆశయం ఉందని అదే యూపీ పోలీస్ ఎగ్జామ్ పాస్ అవ్వడం అని ఖుష్టూ ధీమాతో చెప్పింది. పగలంతా డెలివరీలు పూర్తి చేసి సాయంత్రాలు, రాత్రి వేళల్లో చదువుకుంటానని ఏదో ఒకరోజు నేను పోలీస్ యూనిఫామ్ వేసుకుని మా ఊరికి తిరిగి వెళ్లి, మా తల్లిదండ్రులు, గ్రామం గర్వపడేలా చేయాలనేదే నా కల అని తన లక్ష్యాన్ని వివరించింది. దీనిపై సీఈవో రోహిత్ కపూర్ స్పందిస్తూ.. చాలా మంది తమ గ్రామాలు వదిలి ముంబయికి వస్తే మళ్లీ వెనక్కి వెళ్లకూడదని అనుకుంటారు. కానీ ఖుష్బూ మాత్రం తన గ్రామానికి తిరిగి వెళ్లాలనే ముంబయి వచ్చిందని అది కూడా ఓ పోలీస్ ఆఫీసర్‌గా అని ప్రశంసిచారు. ఇల్లు వదిలి వచ్చే ధైర్యం అందరికీ ఉంటుంది. కానీ ఎందుకు వచ్చామో అనే క్లారిటీ ఉండటం చాలా అరుదు అని రాసుకొచ్చాడు.
ప్రశంసల జల్లు:
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఖుష్బూ పట్టుదలకు ప్రశంసలు కురిపిస్తున్నారు. గిగ్ ఎకానమీలో ఇంత కష్టపడుతూ కూడా భవిష్యత్తుపై ఇంత గొప్ప విజన్ ఉంచుకోవడం అద్భుతం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఇదే సమయంలో కొందరు నెటిజన్లు స్విగ్గీ వంటి కార్పొరేట్ సంస్థల మార్కెటింగ్ విధానాలపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కార్పొరేట్ బ్రాండింగ్ కోసం కార్మికుల కష్టాలను వాడుకోవడం బాగుంది. కానీ ఇలాంటి పార్ట్నర్ల కోసం సంస్థలు నిజంగా ఎలాంటి సహాయం అందిస్తున్నాయి? పరీక్షల ప్రిపరేషన్ కోసం ల్యాప్‌టాప్‌లు, స్టడీ మెటీరియల్ వంటి రిసోర్సెస్ ఇస్తున్నాయా? నిజమైన సాధికారత అనేది కేవలం మార్కెటింగ్ వీడియోల్లో కాకుండా క్షేత్రస్థాయిలో చూపించాలని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఖుష్బూ పట్టుదలకు సర్వత్రా ప్రశంసలు అందుతుండగా ఆమె అనుకున్నది సాధించాలని ఆశిద్దాం.






