శివ భక్తులకు తీపికబురు.. తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-22 04:18:34  IST  )

మంచు కొండల్లో కొలువుదీరిన పరమశివుడి దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఆరు నెలల విరామం తర్వాత కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి.

శివ భక్తులకు తీపికబురు.. తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు నెలల సుదీర్ఘ శీతాకాల విరామం తర్వాత, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ (Kedarnath) ఆలయ ద్వారాలు ఇవాళ ఉదయం సరిగ్గా 8 గంటలకు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ శుభ ఘడియల్లో వేద మంత్రోచ్ఛారణలు, శంఖారావాల మధ్య బాబా కేదార్‌నాథ్ ఆలయ కపాటాలు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈ మేరకు ఆలయాన్ని దాదాపు 51 క్వింటాళ్ల వివిధ రకాల స్వదేశీ, విదేశీ పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా పంచముఖి ఉత్సవ విగ్రహం మంగళవారమే కేదార్‌నాథ్‌ ధామ్‌కు చేరుకుంది. ఆలయ ద్వారాలు తెరుచుకున్న సమయంలో వేలాది మంది భక్తులు చేసిన ‘హరహర మహాదేవ్’, ‘జై కేదార్’ నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగిపోయాయి.

రికార్డు స్థాయిలో భక్తుల నమోదు..

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra)కు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. కేదార్‌నాథ్‌తో పాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి దర్శనం కోసం ఇప్పటి వరకు 14.5 లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Government of Uttarakhand) భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కేదార్‌నాథ్ మార్గంలో ఇంకా మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంది. అదేవిధంగా నేటి నుంచే యమునోత్రి, గంగోత్రి ధామ్‌ల దర్శనం కూడా ప్రారంభం కావడంతో ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర సందడి నెలకొంది.

కేదార్‌నాథ్ ధామం పునఃప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ సందేశం

Next Story