మహారాష్ట్ర తీరంలో విదేశీ బోటు కలకలం.. రంగంలోకి నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు

by Naga Rani Yarlagadda |

మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా తీరంలో అనుమానాస్పద విదేశీ బోటు దర్శనమివ్వడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం అయింది.

మహారాష్ట్ర తీరంలో విదేశీ బోటు కలకలం.. రంగంలోకి నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా తీరంలో అనుమానాస్పద విదేశీ బోటు దర్శనమివ్వడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఆదివారం ఉదయం రేవ్‌దండా సమీపంలోని కోర్లాయి ప్రాంతానికి సుమారు రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో తీరప్రాంతం మొత్తం హైఅలర్ట్‌కి వెళ్లగా, అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ప్రాథమికంగా ఈ పడవపై విదేశీ గుర్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ఇది తీరానికి కొట్టుకువచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే రాయ్‌గఢ్ జిల్లా పోలీసులు, బాంబ్ డిస్పోజల్ బృందం (బీడీడీఎస్), క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ), నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

అయితే, తీవ్ర వర్షాలు, గాలులు వంటి ప్రతికూల పరిస్థితుల వల్ల పడవను పరిశీలించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బార్జ్ సహాయంతో సమీపించే ప్రయత్నం చేసినా వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేశారు. అనుమానాస్పద పరిస్థితుల నేపథ్యంలో, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించగా, జిల్లావ్యాప్తంగా బందోబస్తు బలపరచారు.

Next Story