- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Surrender: మావోయిస్టులకు నేడే ఆఖరి రోజు.. ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది సరెండర్
నక్సలిజం అంతానికి కేంద్రం విధించిన గడువు నేటితో ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఏకే-47లతో సహా భారీగా మావోయిస్టులు లొంగిపోవడంతో సుక్మా జిల్లా ‘నక్సల్ ఫ్రీ’గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కాంకేర్, దంతేవాడ, సుక్మా, నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టులు భారీగా లొంగిపోయి పోలీసులకు ఆయుధాలను అప్పగించారు. మరోవైపు నిన్న లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. భారత్ దాదాపు నక్సల్ రహిత దేశంగా మారిందని, కేవలం రెండు జిల్లాలు మాత్రమే ప్రభావితమై ఉన్నాయని ప్రకటించారు.
కాంకేర్‌లో ఏకే-47తో లొంగుబాటు
కాంకేర్ (Kanker) జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒకరి వద్ద AK-47 రైఫిల్ ఉంది. లొంగిపోయిన హిడ్మా డోడి, శంకర్.. అడవుల్లో ఉన్న తమ సహచరులు కూడా ప్రధాన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక దంతేవాడ జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోగా, వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో సోనే కడ్తీ అనే మావోయిస్టుపై రూ.5 లక్షల రివార్డు ఉంది. మిగిలిన నలుగురిపై తలా లక్ష రూపాయల రివార్డు ఉంది. వీరంతా బీజాపూర్ జిల్లాకు చెందిన వారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ (IG Sunder Raj) సమక్షంలో సరెండ్ అయ్యారు.
నక్సల్ ఫ్రీ రహిత జిల్లాగా సుక్మా..
సుక్మా (Sukma) జిల్లాలో చివరిగా మిగిలి ఉన్న ఇద్దరు మహిళా మావోయిస్టులు భారీ ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోవడంతో సుక్మా జిల్లా ఇప్పుడు పూర్తిస్థాయిలో నక్సల్స్ రహితంగా (Naxal Free) మారిందని అధికారులు ప్రకటించారు. లొంగిపోయిన ఇద్దరు మహిళా మావోయిస్టులు 6 ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. అందులో రెండు AK-47 రైఫిళ్లు, ఒక LMG (Light Machine Gun), మూడు 303 రైఫిళ్లు ఉన్నాయి. అదేవిధంగా వారి నుంచి ఆయుధాలతో పాటు రూ.10 లక్షల నగదు, భారీ ఎత్తున పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలో మిగిలిన చివరి క్యాడర్లు కూడా లొంగిపోవడంతో సుక్మాలో మావోయిస్టుల శకం ముగిసింది.
ఇక నారాయణపూర్ (Narayanpur) జిల్లాలో మాడ్ డివిజన్‌కు చెందిన చివరి ఇద్దరు మావోయిస్టులు భారీ ఆయుధాలతో లొంగిపోయే అవకాశం ఉంది. అబూజ్‌మడ్ అడవుల్లో స్వాధీనం చేసుకున్న భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాల డంప్‌ను పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు. కేంద్రం నిర్దేశించిన గడువు ముగిసే సమయానికి ఛత్తీస్‌గఢ్ దాదాపు నక్సల్స్ రహిత రాష్ట్రంగా అవతరించడం గమనార్హం.






