- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీం మధ్యంతర తీర్పు.. ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే రూల్‌పై స్టే
వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పును వెలువరించింది. చట్టంలో వివాదాస్పదంగా ఉన్న పలు కీలక అంశాలపై స్టే విధిస్తూ సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేశారు. సెక్షన్ (3) (R) ప్రకారం కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధనపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించారు. ఒకవేళ ఆ నిబంధన అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా సెక్షన్ 2(C) ప్రకారం నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదనే రూల్‌పై కూడా స్టే ఇచ్చారు. ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరని తెలిపారు. సెక్షన్ 3(C) ప్రకారం.. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్‌కు ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకమని, అధికారుల తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిమే ఉండటం మంచిదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని కొన్ని సెక్షన్లపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాగా, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం కాంట్రవర్సీకీ కేరాఫ్ మారింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దేశ అత్యున్న న్యాయస్థానంలో 72 పిటిషన్లు దాఖలు.. ఆ పిటిషన్లపై మాజీ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న విచారణ చేపట్టింది. కేసులో తదుపరి విచారణను మే 15కి వాయిదా వేసింది. ఈ లోపే జస్టిస్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయడంతో.. కేసులో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టింది. మే 22 ఇరు పక్షాల వాదనలు పూర్తి అవ్వడంతో నేడు సుప్రీం కోర్టు వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.






