కారుణ్య నియామకాలకు పెళ్లైన కూతుర్లూ అర్హులే.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-02 07:31:15  IST  )

తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు (Married Daughters) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది.

కారుణ్య నియామకాలకు పెళ్లైన కూతుర్లూ అర్హులే.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు (Married Daughters) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు (Compassionate Appointments) వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం పెళ్లి అయిందనే కారణంతో మహిళల హక్కులను కాలరాయలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, ఉద్యోగంలో ఉండగా తల్లిదండ్రులు మరణిస్తే, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా అందించేందుకు కారుణ్య నియామకాల పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, అనేక ప్రభుత్వ నిబంధనల్లో కేవలం కుమారులు లేదా అవివాహిత కుమార్తెలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తూ, పెళ్లయిన కుమార్తెలను మినహాయిస్తున్నారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేవలం వైవాహిక స్థితిని (Marital Status) బట్టి కుమార్తెల హక్కులను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం. వివాహం అనేది ఒక మహిళ అర్హతను మార్చలేదు అని కోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల్లో కుమారులతో పాటు వివాహిత కుమార్తెలకు కూడా సమానమైన అర్హత ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివాహిత మహిళలకు ఈ తీర్పు పెద్ద అండగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ కారుణ్య నియామక నిబంధనల్లో ఉన్న 'అవివాహిత' అనే పదాన్ని తొలగించి, వివాహిత కుమార్తెలను కూడా చేర్చాల్సి ఉంటుంది. లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా, మహిళా హక్కుల రక్షణలో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఎంతోమంది బాధితులకు న్యాయం జరగనుంది.

Next Story