ఓటరు జాబితా సవరణకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం: సుప్రీంకోర్టు హెచ్చరిక

by Ramesh Naini |

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటంకం కలిగించకూడదని సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది.

ఓటరు జాబితా సవరణకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం: సుప్రీంకోర్టు హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటంకం కలిగించకూడదని సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా బెంగాల్‌లో SIR గడువును ఫిబ్రవరి 14 నుంచి మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘ఎటువంటి ఆదేశాలు లేదా వివరణలు కావాలన్నా మేము ఇస్తాం. కానీ, SIR ప్రక్రియకు మాత్రం ఎలాంటి అడ్డంకులు కలిగించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు గుర్తుంచుకోవాలి’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసింది?

ఎన్నికల సంఘం (EC) తీసుకుంటున్న నిర్ణయాలపై మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో వేల సంఖ్యలో 'మైక్రో అబ్జర్వర్ల'ను నియమించడాన్ని తప్పుబట్టారు. అయితే, ఎన్నికల సంఘం దీనిపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తమకు సరైన సహకారం అందించడం లేదని, పదే పదే లేఖలు రాసినా సిబ్బంది వివరాలు ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. దీనిపై ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ‘మైక్రో అబ్జర్వర్లకు బదులుగా 8,000 మంది గ్రూప్-బీ అధికారుల పేర్లను పంపడంలో ఎందుకు జాప్యం చేశారు? మేము ఫిబ్రవరి 4నే ఆదేశాలు ఇస్తే, ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి వేళ మెయిల్ ద్వారా పేర్లు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని ప్రశ్నించింది.

బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. ఎన్నికల సంఘం ఎప్పుడూ గ్రూప్-బీ అధికారుల కోసం విన్నవించలేదని కోర్టుకు తెలిపారు. మరో న్యాయవాది శ్యామ్ దివాన్ స్పందిస్తూ.. పేర్ల జాబితా సిద్ధంగా ఉందని, ఇప్పటికే వాటిని పంపామని వెల్లడించారు. చివరికి, ఫిబ్రవరి 7న ప్రభుత్వం 8,505 మంది అధికారుల వివరాలను పంపిందని కోర్టు గుర్తించింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను కాపాడాలని సూచిస్తూ, తదుపరి ప్రక్రియ సజావుగా సాగాలని ఆదేశించింది.

Next Story