Supreme court: ప్రభుత్వ భవనాల్లో వారికి ప్రత్యేక గదులు ఉండాలి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన

by B.Srinivas |

ప్రభుత్వ భవనాల్లో పిల్లల సంరక్షణ, శిశువులకు ఆహారం అందించడానికి ప్రత్యేక గదులు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Supreme court: ప్రభుత్వ భవనాల్లో వారికి ప్రత్యేక గదులు ఉండాలి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ భవనాల్లో పిల్లల సంరక్షణ, శిశువులకు తల్లి పాలు ఇవ్వడానికి ప్రత్యేక గదులు ఉండాలని సుప్రీంకోర్టు (Supreme court) అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించింది. దీని వల్ల తల్లుల గోప్యత కాపాడబడుతుందని, పిల్లలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని జస్టిస్ బీవీ నాగరత్న, ప్రసన్న బీ వరాలేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే ఉన్న బహిరంగ ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకు ఈ తరహా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రయోజనం కోసం తగినంత స్థలాన్ని కేటాయించాలని వెల్లడించింది.

బహిరంగ ప్రదేశాల్లో శిశువులు, తల్లులకు ఫీడింగ్ రూమ్స్, చైల్డ్ కేర్ గదులు లేదా ఏవైనా ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రాలు ఈ సలహాను అమలు చేస్తే, తల్లులు, శిశువుల గోప్యతను సులభతరం చేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ అంశంపై మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గతేడాది ఫిబ్రవరిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఒక అడ్వైజరీ జారీ చేశారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ఎటువంటి నోటీసు జారీ చేయలేదని తమకు తెలుసని పేర్కొంది. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన బెంచ్, రెండు వారాల్లోగా తన ఆదేశాలను పాటించాలని కేంద్రాన్ని కోరింది.

Next Story