Supreme court: గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించలేం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

by B.Srinivas |

బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Supreme court: గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించలేం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు ఆదేశించొచ్చా అనే విషయంపై అభిప్రాయాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో లిఖిత పూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి చర్య తీసుకోవడానికి నిర్ణీత కాలపరిమితిని విధించడం అంటే రాజ్యాంగం ద్వారా లభించని అధికారాలను స్వీకరించడమే అవుతుందని పేర్కొంది. ఇది కాన్సిట్యూషనల్ డిసార్డర్‌కు దారి తీస్తుందని తెలిపింది. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా లభించని అధికారాలను మరొక రకంగా ఇవ్వలేమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతి పదవులు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవులని, ఏదైనా సమస్య తలెత్తితే రాజకీయంగా, రాజ్యాంగ బద్ధంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం సముచితం కాదని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సవరించలేదు

ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు కూడా శాసన ప్రక్రియను మార్చేందుకు వీలులేదని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాన్ని కూడా అడ్డుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రక్రియలో అమలులో కొన్ని పరిమిత సమస్యలు ఉన్నాయని, అయితే గవర్నర్ల వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారిని కింది స్థాయి అధికారుల్లా పరిగణించాలని దీని అర్థం కాదని వెల్లడించారు. గవర్నర్, ప్రెసిడెంట్ పదవులు ప్రజాస్వామ్య పాలనలో అత్యున్నత ఆదర్శాలను సూచిస్తాయని తెలిపారు. వీరికి ఇవ్వబడిన అధికారులు పూర్తిగా కార్యనిర్వహఖ శాఖ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ దీనిలో ఏ విధంగానూ జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 200 ప్రకారం, బిల్లుపై నిర్ణయం తీసుకునే గవర్నర్ హక్కు న్యాయ సమీక్షకు లోబడి ఉండదు. ఒక బిల్లును గవర్నర్‌కు పంపినప్పుడు, గవర్నర్‌కు నాలుగు ఎంపికలు ఉన్నాయని, ఆయన బిల్లును ఆమోదించొచ్చు, తిరిస్కరించొచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలకు పంపొచ్చు అని గుర్తు చేశారు. ఈ అధికారాలను వినియోగించుకోవడానికి రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగా ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదని వెల్లడించారు.

వివాదం ఇదే?

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి సంబంధించిన కేసులో ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో గవర్నర్లు, రాష్ట్రపతి అటువంటి ఆమోదం ఇవ్వడానికి గడువును విధించింది.దీనిపై, రాష్ట్రపతి ముర్ము అటువంటి గడువును నిర్ణయించాలన్న ఆదేశాలపై సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలపై తన అభిప్రాయం తెలియజేయాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలను పరిశీలించడానికి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి దీనిపై విచారణ జరగనుంది.

Next Story