- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Supreme court: తప్పుదోవ పట్టించే యాడ్స్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో: తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు (Supreme court) సీరియస్ అయింది. ఈ తరహా యాడ్స్‌కు వ్యతిరేకంగా దాఖలయ్యే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. తప్పుడు ప్రకటనలు సమాజానికి తీవ్ర హాని కలిగిస్తాయని, వాటిపై కఠినమైన పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది. పతంజలి, యోగా గురువు రామ్ దేవ్ బాబా తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ 2022లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుంచి మిస్ లీడింగ్ యాడ్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది.
న్యాయమూర్తులు ఏఎస్. ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను అరికట్టడానికి ‘డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, 1954’ను కఠినంగా అమలు చేయాలని తెలిపింది. చట్టాన్ని రూపొందించి 74 ఏళ్లు అయినప్పటికీ ఇది సరిగ్గా అమలు కాలేదని పేర్కొంది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని తెలిపింది. తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే, వాటిని విచారణకు పంపించాలని, ఒకవేళ ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలిపింది. చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి పోలీసులకు సైతం అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది.