Supreme court: అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలి.. తాహిర్ హుస్సేన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు

by vinod kumar |
Supreme court: అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలి.. తాహిర్ హుస్సేన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్ (Tahir Hussain) బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘జైల్లో కూర్చొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎలక్షన్స్‌లో గెలవడం సులువే. కానీ అలాంటి వారందరినీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలి’ అని వ్యాఖ్యానించింది. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పంజకజ్ మిథాల్, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించి పై వ్యాఖ్యలు చేసింది. సమాయాభావం కారణంగా తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తాహిర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ తాహిర్ నామినేషన్ ఆమోదించినట్లు తెలిపారు. కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా, 2020 ఢిల్లీ అల్లర్లలో తాహిర్ హుస్సేన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ కాగా ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముస్తఫాబాద్ అసెంబ్లీ నుంచి ఎంఐఎం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.

Advertisement

Next Story