ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న 26 మంది భారతీయులు.. కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు

by Ramesh Naini |

ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న 26 మంది భారతీయుల వ్యవహారంపై భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.

ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న 26 మంది భారతీయులు.. కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న 26 మంది భారతీయుల వ్యవహారంపై భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా తక్షణమే దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

ఉపాధి పేరిట మానవ అక్రమ రవాణా

మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏజెంట్లు కొందరు భారతీయులను రష్యాకు పంపారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారిని బలవంతంగా రష్యా సైన్యంలోకి చేర్చి ఉక్రెయిన్ యుద్ధ రంగానికి తరలించారు. 2025 సెప్టెంబరు - అక్టోబరు మధ్య కాలంలో కుప్యాన్స్క్, సెలైడోవ్, మకివ్కా, చెల్యాబిన్స్క్ వంటి భీకర యుద్ధ ప్రాంతాల నుంచి బాధితులు చివరిసారిగా తమ కుటుంబాలకు సందేశాలు పంపారు. కొందరు గాయపడగా, మరికొందరు నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సుప్రీంకోర్టులో విచారణ.. కేంద్రానికి ఆదేశాలు

విదేశాంగ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, హోం శాఖలను సంప్రదించినా సరైన సమాచారం గానీ, సహాయం గానీ లభించకపోవడంతో బాధిత కుటుంబాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. రష్యాలో చిక్కుకున్న భారతీయుల దయనీయ స్థితిపై కేంద్ర ప్రభుత్వం నుంచి వివరాలు సేకరించి తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులను రక్షించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ముఖ్యంగా నకిలీ ఉద్యోగాల పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న అక్రమ రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్‌ల ఆటకట్టించాలని ఈ సందర్భంగా పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.

Next Story