ఇద్దరు మహిళా జడ్జిల పునర్నియామకం

by Ajay Maddhiboyina |

2023 నవంబర్ 11న పని తీరు సంతృప్తిగా లేదనే కారణంతో ఆరుగురు మహిళా సివిల్ జడ్జీలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది.

ఇద్దరు మహిళా జడ్జిల పునర్నియామకం
X

- తొలగింపు ఉత్తర్వులు కొట్టేసిన సుప్రీంకోర్టు

- 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మహిళా న్యాయమూర్తులను తొలగిస్తూ 2023 మేలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. జడ్జీలను తొలగించడం శిక్షాత్మకం, ఏకపక్షమని అభివర్ణించింది. 15 రోజుల్లోగా ఇద్దరు మహిళా జడ్జీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. మహిళలకు సున్నితమైన పని వాతావరణం ఉండాల్సిన ప్రాముఖ్యతను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మసనం నొక్కి చెప్పింది. గర్భధారణ, ప్రసూతి సమయంలో మహిళలకు పని ప్రదేశంలో హక్కులు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. సాయుధ దళాల్లో మహిళా అధికారులు దేశానికి సేవ చేయడానికి అనుమతి ఉందని గర్వంగా చెప్తేనే సరిపోదు. మనం వారికి సున్నితమైన పని వాతావరణాన్ని కూడా కల్పించాలని ధర్మాసనం చెప్పింది.

2023 నవంబర్ 11న పని తీరు సంతృప్తిగా లేదనే కారణంతో ఆరుగురు మహిళా సివిల్ జడ్జీలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. కాగా, 2024 అగస్టు 1న జ్యోతి వర్కడే, సోనాక్షి జోషి, ప్రియా శర్మ, రచనా అతుల్కర్ జోషి అనే జడ్జీలను పునర్‌నియమించారు. అయితే అదితి కుమార్ శర్మ, సరితా చౌదరిలను మాత్రం ఉద్యోగంలోకి తీసుకోలేదు. వీరిద్దరినే తాజాగా సుప్రీంకోర్టు విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉండటం వల్ల తీర్పుల్లో నాణ్యత పెరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేసే కేసులపై సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్పింది.

Next Story