- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ ఎస్‌ఐఆర్‌పై పొలిటికల్ పార్టీల తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
బిహార్ ఎస్‌ఐఆర్‌పై పొలిటికల్ పార్టీల తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు. విమర్శలు చేస్తున్నారు.. అభ్యంతరాలు లేవనెత్తకపోవడంపై ఆశ్చర్యం.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో విడుదల చేసిన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌పై అభ్యంతరాలు లేవనెత్తడంలో ప్రజలకు సహకారం అందించకపోవడంపై రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై నమోదైన కేసులపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ప్రజలు ఫిర్యాదులు చేయడంలో పార్టీ కార్యకర్తలు సహకరించాలని, ఈ మేరకు ఆ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేయాలని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం సూచనలు చేసింది.
ఈసీ నిర్దేశించిన 11 ధ్రువపత్రాలు లేదంటే ఆధార్ కార్డు సాయంతో ఈ అభ్యంతరాలు తెలపొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతానికైతే ఎస్ఐఆర్ గడువును తాము మార్చబోవడం లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘ఆధార్ కార్డు లేదా ఈసీ నిర్దేశించిన 11 డాక్యుమెంట్లతో ప్రజలు అభ్యంతరాలు సమర్పించాలి. ఈ విషయంలో ఆయా పార్టీ కార్యక్తలంతా ప్రజలకు సహకరించేలా బిహార్‌లోని 12 ప్రధాన రాజకీయ పార్టీలు ఆదేశాలు జారీచేయాలి’ అని జస్టిస్ కాంత్ తేల్చిచెప్పారు.
బిహార్‌లో 1.68 లక్షల మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారని, అయితే ఇప్పటి వరకు కేవలం రెండు అభ్యంతరాలు మాత్రమే నమోదయ్యాయని కోర్టుకు ఈసీ తెలిపింది. ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌లో 65 లక్షల పేర్లు తొలగించినట్లు ఇదివరకే ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు తెలుపుతున్నప్పటికీ.. కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే నమోదవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది.
అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు సమర్పిస్తున్న అభ్యంతరాల దరఖాస్తులను ఈసీ స్వీకరించడం లేదని విపక్షాల తరఫు లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. ఈ క్రమంలోనే 12 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరాలు తెలపడంలో ప్రజలకు సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని, నేరుగా ఫిజికల్ ఫామ్స్ అందచేస్తే వాటిని బూత్ స్థాయి అధికారులు స్వీకరించాలని ఆదేశించింది.






