- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: ప్రజలను పరాన్న జీవులుగా మార్చకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత వాగ్దానాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత వాగ్దానాలపై సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలక్షన్ టైంలో వాగ్దాగాలు ఇవ్వడం సరికాదని తెలిపింది. ఉచిత రేషన్, ఉచిత నగదు ఇవ్వడం వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించింది. అన్ని ఫ్రీగా వస్తే కష్టపడి పని చేయడానికి ఆసక్తి ఉండదని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ‘ఉచిత పథకాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఫ్రీ రేషన్ అందుతోంది. ఏ పని చేయకుండానే డబ్బులు పొందుతున్నారు. అందుకే ఈ తరహా పరిస్థితి నెలకొంది’ అని పేర్కొంది. పేదల పట్ల ప్రభుత్వాలు శ్రద్ద చూపడం సరైందే అయినప్పటికీ, లబ్ధిదారులను సమాజంలోని ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని దేశాభివృద్ధిలో భాగం చేయడానికి అనుమతించడం మంచిది కాదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు. పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తోందని ధర్మాసనానికి తెలియజేశారు. దీనిలో పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించే సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. అనంతరం స్పందించిన బెంచ్ ఈ పథకం ఎన్ని రోజుల్లో అమలు చేస్తారో తెలియ జేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాల్లో షెల్టర్ హోమ్ పథకానికి ప్రభుత్వం నిధులు నిలిపివేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం పేదలకు ప్రాధాన్యత ఇవ్వదని, ధనికులను మాత్రమే చూసుకుంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. కోర్టులో రాజకీయ వ్యాఖ్యలు అనుమతించబోమని స్పష్టం చేసింది.






