Supreme Court: విద్యకు దూరమైన అనాథ పిల్లలపై సర్వే నిర్వహించండి

by S Gopi |

పిల్లల సంరక్షణ, రక్షణ అవసరమైన అనాథల గురించి ఆందోళనలను లేవనెత్తిన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా..

Supreme Court: విద్యకు దూరమైన అనాథ పిల్లలపై సర్వే నిర్వహించండి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009 కింద విద్యకు దూరమైన అనాథ పిల్లల గురించి సర్వే చేయాలని సుప్రీంకోర్టు బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఆ పిల్లలకు సంబంధించి డేటాను చేర్చడాన్ని పరిశీలించాలని న్యాయమూర్తులు బీ వి నాగరత్న, కే వి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. పిల్లల సంరక్షణ, రక్షణ అవసరమైన అనాథల గురించి ఆందోళనలను లేవనెత్తిన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2009 చట్టంలోని నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఇప్పటికే ప్రవేశం పొందిన అనాథ పిల్లల వివరాలపై సర్వే చేయాలని వెల్లడించింది. ఇదే సమయంలో చట్ట ప్రకారం ఉచిత, తప్పనిసరి విద్యా హక్కుకు దూరమైన పిల్లల వివరాలు సేకరించాలని, ఒకవేళ విద్యకు దూరమైతే అందుకు గల కారణాలను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. ఆ వివరాలతో రాష్ట్రాలు తమ అఫిడవిట్లను సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది. సర్వే చేస్తున్న సమయంలోనే అర్హులైన పిల్లలను దగ్గరలో ఉన్న పాఠశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ ఆదేశాలు పాటించడానికి అధికారులకు ధర్మాసనం నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఇప్పటికే చట్టంలోని సెక్షన్ 12 (1) (సీ) కింద బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి 25 శాతం కోటాలో అనాథ పిల్లలను చేర్చడానికి గుజరాత్, ఢిల్లీ, మేఘాలయ, సిక్కిం సహా అనేక రాష్ట్రాలు నోటిఫికేషన్లు జారీ చేశాయని రికార్డుల్లో ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి నోటిఫికేషన్ జారీ చేయాలని, సంబంధిత అఫిడవిట్‌ను రికార్డులో దాఖలు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్ తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా, రాబోయే జనాభా లెక్కల్లో అనాథల డేటాను కూడా చేర్చేలా పిటిషనర్ కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అందుకు విడిగా రికార్డుల్లో బాక్స్ ఉండేలా చూడాలని కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపింది.

Next Story