సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. వారిని తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్

by Malleboina Mahesh |

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఇద్దరు స్వీపర్లను విధుల నుంచి తొలగించిన కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. వారిని తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఇద్దరు స్వీపర్లను విధుల నుంచి తొలగించిన కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. స్వీపర్ పింకీ, ఆమె భర్తను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా (Child Trafficking) ఆరోపిస్తూ ఈ దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ ద్వారా (మున్సిపల్ కార్పొరేషన్ తరఫున) వారిని సర్వీస్ నుంచి తొలగించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినందుకు శిక్షగా ఈ తొలగింపు జరిగిందని ఆరోపణలు రావడంతో, ఈ అంశాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించింది.

జస్టిస్ జె.బి. పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పేద దంపతులను ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కౌన్సిల్‌ను ఆదేశించింది. "న్యాయ మిత్ర (Amicus Curiae) ద్వారా మా దృష్టికి తీసుకురాబడిన విషయం హృదయ విదారకంగా, దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈ కోర్టు వారి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వారిని తొలగించారు. ఒకవేళ వారిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే, తొలగింపునకు కారణమైన సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని మేము ఆదేశిస్తాము," అని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినందుకు ఒక పేద జంటను వేధించడంపై కోర్టు కఠిన వైఖరిని ప్రదర్శించింది.

Next Story