80 కేసులు.. పదేళ్ల యుద్ధం.. చివరకు భార్యదే పైచేయి: ‘మహాభారతం’తో పోల్చిన సుప్రీంతీర్పు!

by Gantepaka Srikanth |

దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న ఒక వివాహ బంధానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది.

80 కేసులు.. పదేళ్ల యుద్ధం.. చివరకు భార్యదే పైచేయి: ‘మహాభారతం’తో పోల్చిన సుప్రీంతీర్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న ఒక వివాహ బంధానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని "మహాభారత యుద్ధం"తో పోల్చిన అత్యున్నత న్యాయస్థానం, భార్యకు విడాకులు మంజూరు చేస్తూనే, భర్త ఆమెకు రూ.5 కోట్ల భారీ భరణం చెల్లించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఒక దంపతులకు 2010లో వివాహం జరిగింది. ఆరేళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది, వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే, 2016 నుంచి వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుండి ఇరుపక్షాల మధ్య చట్టపరమైన యుద్ధం మొదలైంది. భర్త వృత్తి రీత్య న్యాయవాది కావడంతో చాలా తెలివిగా భార్య, ఆమె కుటుంబంపై చాకచక్యంగా ఏకంగా 80కి పైగా కేసులు దాఖలు చేశారు. ఇందులో క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు కూడా ఉన్నాయి.

భర్త ప్రవర్తనపై కోర్టు ఆగ్రహం..

వృత్తిరీత్యా న్యాయవాది అయిన భర్త, తన న్యాయ పరిజ్ఞానాన్ని భార్యను వేధించడానికి ఉపయోగించారని కోర్టు అభిప్రాయపడింది. భార్య తరఫు లాయర్లపై కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఆయన తన కంపెనీ పదవులకు రాజీనామా చేసి, తక్కువ ఆదాయం ఉన్నట్లు చూపించుకున్నారని భార్య చేసిన ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఏకకాలంలో భార్యకు రూ.5 కోట్ల భరణం చెల్లించాలని.. చెల్లించిన తర్వాతనే ఆమె ఇళ్లు ఖాళీ చేస్తుంది కోర్టు స్పష్టం చేసింది. మైనర్లయిన ఇద్దరు కుమారులను నెలకోసారి చూడ్డానికి భర్తకు కోర్టు అనుమతి ఇచ్చింది. భవిష్యత్‌లో మరోసారి భార్యను, ఆమె తరపు బంధువులను, లాయర్లను వేధిస్తూ అత్యంత కఠినంగా శిక్షిస్తామని కోర్టు హెచ్చరించింది.

Next Story