Supreme Court: కాలేజీ లవ్ స్టోరీలన్నీ నేరాలేనా?.. పురుషుడినే దోషి చేయడం పాతకాలపు మైండ్‌సెట్: సుప్రీం

by Mahesh Kanagandla |   (  Updated:2025-04-02 15:08:20  IST  )

పెళ్లి పేరుతో మోసం చేశాడన్న(False Promise of Marriage) కేసులు పెరగడంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రొమాన్స్(Romance) తప్పుదారిపట్టినప్పుడు, బ్రేకప్ జరిగినప్పుడల్లా మహిళ ద్వారా రేప్ కేసు(Rape Case)లు నమోదు కావాలనేమీ లేదని పేర్కొంది. ముఖ్యంగా సమాజంలో గణనీయంగా మారిన నైతిక విలువల నేపథ్యంలో ఈ పరిణామాలను చూడాలని తెలిపింది. సంబంధంలో ఉన్నప్పుడు తదుపరిగా ఏం జరుగుతుందనే అవగాహన మహిళకూ ఉంటుందని, ఏ నిర్ణయం తీసుకోవాలనే ఆప్షన్ కూడా ఉంటుందని వివరించింది.

Supreme Court: కాలేజీ లవ్ స్టోరీలన్నీ నేరాలేనా?.. పురుషుడినే దోషి చేయడం పాతకాలపు మైండ్‌సెట్: సుప్రీం
X

దిశ, నేషనల్ బ్యూరో: పెళ్లి పేరుతో మోసం చేశాడన్న(False Promise of Marriage) కేసులు పెరగడంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రొమాన్స్(Romance) తప్పుదారిపట్టినప్పుడు, బ్రేకప్ జరిగినప్పుడల్లా మహిళ ద్వారా రేప్ కేసు(Rape Case)లు నమోదు కావాలనేమీ లేదని పేర్కొంది. ముఖ్యంగా సమాజంలో గణనీయంగా మారిన నైతిక విలువల నేపథ్యంలో ఈ పరిణామాలను చూడాలని తెలిపింది. సంబంధంలో ఉన్నప్పుడు తదుపరిగా ఏం జరుగుతుందనే అవగాహన మహిళకూ ఉంటుందని, ఏ నిర్ణయం తీసుకోవాలనే ఆప్షన్ కూడా ఉంటుందని వివరించింది. ప్రతి రిలేషన్‌షిప్‌ను నేరంగా చూడలేమని, అలాగైతే కాలేజీలో అమ్మాయి, అబ్బాయిల కలిసున్న ఘటనలన్నీ నేరాలుగా పరిగణించలేం కదా అని పేర్కొంది. రిలేషన్‌షిప్ బ్రేక్ అయ్యాక పురుషుడిని దోషిగా చూడటం పాతకాలపు మైండ్‌సెట్ అని తెలిపింది. ఎంగేజ్‌మెంట్ తర్వాత సంబంధం ఆగిపోయిన ఘటనలో పురుషుడిపై మహిళ పెట్టిన రేప్ కేసు పెట్టింది. ఈ కేసు కొట్టేయాలని పురుషుడు దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పెళ్లి చేసుకుంటాననే మాటిచ్చి తనతో శారీరకంగా కలిశాడని సదరు మహిళ వాదించింది. ‘మీరు నిజంగా అంతటి నిస్సహాయురాలైతే మా ముందు ఉండేవారు కాదు. మీరు మేజర్. పెళ్లి అనో, మరోటి అనో మిమ్మల్ని ట్రిక్ చేసి మోసపుచ్చే స్థితి ఉండకపోవచ్చు. నేడు కొత్త తరంతో నైతిక విలువల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. మీ వాదనతో మేం అంగీకరిస్తే నేడు కాలేజీలో అబ్బాయి, అమ్మాయి మధ్యనున్న ప్రతి సంబంధమూ నేరమే అవుతుంది. ఒక వేళ వారిద్దరు ప్రేమించుకుంటే.. అమ్మాయి వద్దన్నా వచ్చే వారమే పెళ్లి చేసుకుంటానని అబ్బాయి మాటిచ్చి చేసుకోకుంటే, అది నేరమే అవుతుందా’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి కేసులు పాతకాలపు సాంప్రదాయవాదుల మైండ్‌సెట్ అని కొట్టిపారేసింది. ‘వ్యవస్థలో కొంత గ్యాప్ ఉన్నది. మా నుంచి మీరు కోరుకునేది పక్కనపెడితే.. అంతిమంగా మీరే బాధితులు’ అని న్యాయమూర్తులు ఎంఎం సుంద్రేశ్, రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం వివరించింది.

మహిళ తరఫున సీనియర్ అడ్వకేట్ మాధవి దివన్ వాదిస్తూ.. ‘ఇది రొమాంటిక్ రిలేషన్‌షిప్ కాదు. ఇది అరేంజ్ చేసింది. ఇక్కడ ఆమె స్వేచ్ఛాయుంగా సమ్మతి ఇచ్చిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఆమె ఎంగేజ్‌మెంట్ చెడిపోతే సమాజం ఆమెను వేరుగా చూస్తుంది. ఒక వేళ ఆయనను తృప్తిపరచకుంటే తనను పెళ్లి చేసుకోకపోవచ్చనే ఆందోళన ఆమెకున్నది. వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇది ఆయనకు క్యాజువల్ సెక్స్ కావొచ్చు, కానీ ఆమెకు కాదు’ అని వివరించారు. ‘అందులో తేడా ఏముననది? రేపు పెళ్లి అయినా, కాకపోయినా, మారిటల్ రేప్ అనే ఆరోపణ చేయొచ్చు. పెళ్లి జరక్కపోతుండేనేమో, అదొక్కటే తేడా’ అని ధర్మాసనం పేర్కొంది. ‘మీలాంటి సీనియర్ లాయర్‌ను కేసుకు పెట్టుకోవడమే ఆమె అంతటి నిస్సహాయురాలు కాదని నిరూపిస్తున్నది’ అని తెలిపింది. ‘మనం ఒక వైపు నుంచే చూడలేం. ఒక లింగంతోనే ప్రత్యేక అనుబంధమేమీ లేదు. నాకు కూడా బిడ్డ ఉన్నది. ఆమె కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ వ్యవహారాన్ని విస్తృత కోణంలోనే చూడాల్సి ఉంటుంది’ అని జస్టిస్ సుంద్రేశ్ పేర్కొన్నారు. ‘ఈ సంబంధం ఏదో ఒకరోజు తెగిపోతుందనే వాస్తవం తెలిసే మీరు సంబంధాన్ని యాక్సెప్ట్ చేశారు’ అని జస్టిస్ బిందాల్ తెలిపారు. పురుషుడి వాదనలూ విని తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

Next Story