Supreme court: పీఎంఎల్ఏ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారా.. ఈడీపై సుప్రీంకోర్టు ఫైర్

by B.Srinivas |

నిందితుడిని జైలులో ఉంచడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉపయోగించినందుకు గాను ఈడీ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme court: పీఎంఎల్ఏ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారా.. ఈడీపై సుప్రీంకోర్టు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: నిందితుడిని జైలులో ఉంచడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉపయోగించినందుకు గాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)పై సుప్రీంకోర్టు (Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం లాగా ఈ నిబంధనను కూడా దుర్వినియోగం చేస్తున్నారా అని ప్రశ్నించింది. ఒకరిని జైలులో ఉంచడానికి ఉద్దేశ పూర్వకంగా పీఎంఎల్ఏ (PMLA) ను వాడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ త్రిపాఠికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మనీలాండరింగ్ నిరోధక చట్టం భావన ఒక వ్యక్తి జైలులోనే ఉండాలని కాదు. అభియోగం రద్దు చేయబడిన తర్వాత కూడా ఆ వ్యక్తిని జైలులో ఉంచాలనే ధోరణి ఉంటే, ఏమి చెప్పగలం? ఐపీసీ 498A కేసుల్లో ఏమి జరిగిందో పీఎంఎల్ఏ కూడా అలాగే దుర్వినియోగం చేయబడుతోంది’ అని బెంచ్ తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించిన తీర్పును సవాలు చేస్తూ త్రిపాఠి దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగ్నిజెన్స్ ఆర్డర్ రద్దైన తర్వాత కస్టడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది. బెయిల్ షరతులను ఉల్లంఘించడం సరికాదని తెలిపింది. అయితే ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, బెయిల్ మంజూరును వ్యతిరేకించారు.

Next Story