Kambala Race: కంబళకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. 'పెటా' పిటిషన్ కొట్టివేత!

by Ramesh Naini |

కర్ణాటక సంప్రదాయ క్రీడ 'కంబళ'కు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

Kambala Race: కంబళకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. పెటా పిటిషన్ కొట్టివేత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక సంప్రదాయ క్రీడ 'కంబళ'కు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రీడను కేవలం కోస్తా జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడిపిలకే పరిమితం చేయాలని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహించకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జంతు హక్కుల సంస్థ 'పెటా' (PETA) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒక ప్రాంతపు సంస్కృతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయం చేయడంలో తప్పేముంది? దానిని కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతానికే ఎందుకు పరిమితం చేయాలి?’ అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది.

'పెటా' వాదనను తిరస్కరించిన కోర్టు

బెంగళూరులో కంబళ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ 'పెటా' తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ‘కంబళ కేవలం కోస్తా తీర ప్రాంత సంప్రదాయమని, బెంగళూరు సంస్కృతికి దీనికి ఎలాంటి సంబంధం లేదని’ వారు వాదించారు. అయితే, ఈ వాదనతో ధర్మాసనం విభేదించింది. సాంస్కృతిక వారసత్వాన్ని విస్తరించే హక్కును తాము సమర్థిస్తున్నామని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు కూడా ఈ క్రీడ, సంస్కృతి గురించి తెలుసుకోనివ్వండి, దీనికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని అని జస్టిస్ మెహతా అభిప్రాయపడ్డారు.

కంబళ అభిమానుల్లో హర్షాతిరేకాలు

గతంలోనే జల్లికట్టు, కంబళ వంటి క్రీడల నిర్వహణకు వీలు కల్పించే చట్ట సవరణలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. తాజా తీర్పుతో బెంగళూరు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంబళ నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని భావిస్తున్నారు. తుళునాడు గర్వకారణమైన ఈ సంప్రదాయ క్రీడను రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించే అవకాశం కలగడంపై కంబళ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story