- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: షరియత్ నుంచి మినహాయించండి.. సుప్రీంకోర్టులో ముస్లిం మహిళ పిటిషన్ !
షరియత్ చట్టంపై తనకు నమ్మకం లేదని, వారసత్వ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఓ ముస్లిం మహిళ పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: షరియత్ చట్టంపై తనకు నమ్మకం లేదని, కాబట్టి రాజ్యాంగంలోని వారసత్వ చట్టాన్ని తనకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కేరళకు చెందిన ఓ ముస్లిం మహిళ సుప్రీంకోర్టు (Supreme court)లో పిటిషన్ దాఖలు చేశారు. ముస్లిం మతాన్ని ఆచరించడం లేదని షరియత్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) , జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఆస్తి విషయంలో లౌకిక చట్టాలను అనుసరించవచ్చా లేదా ముస్లిం వ్యక్తిగత చట్టమైన షరియాకు కట్టుబడి ఉండాలా అని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని తెలిపింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
కేసు నేపథ్యం
కేరళలోని అలప్పుజాకు చెందిన షఫియా (Shafia) అనే మహిళకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో తన ఆస్తిని మొత్తం కుమార్తెకు రాసివ్వాలనుకుంటోంది. అయితే షరియత్ చట్టాల ప్రకారం తల్లి దండ్రుల ఆస్తిలో మూడింట ఒక వంతు వాటా మాత్రమే ముస్లిం మహిళలకు ఉంటుంది. దీంతో తనకు ఇస్లాం మతంపై నమ్మకం లేదని, తన భర్త, తాను ముస్లిం మతాన్ని ఆచరించడంలేదని చెప్పారు. కాబట్టి షరియత్ చట్టం కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతానికి సంబంధించి తనకున్న ప్రాథమిక హక్కులను వినియోగించుకునేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలను అనుసరించడానికి ఇష్టపడని వ్యక్తిపై దేశంలోని లౌకిక చట్టాలను ప్రయోగించాలని కూడా సుప్రీంకోర్టును కోరారు.
ఆసక్తికర ప్రశ్నలు లేవనెత్తారు: తుషార్ మెహతా
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ (Tushar mehatha) మెహతా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మూడు వారాల సమయం కావాలని కోరారు. పిటిషన్‌లో ఆసక్తికర ప్రశ్నలు లేవనెత్తారని తెలిపారు. క్రిమినల్ చట్టాలు సాధారణమైనప్పటికీ, వారసత్వం, దత్తత విషయంలో కొన్ని వర్గాలలో విభిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. దీంతో స్పందించిన న్యాయస్థానం నాలుగు వారాల సమయం ఇచ్చింది. కాగా, ఉమ్మడి పౌరస్మృతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ముస్లిం మహిళ వేసిన పిటిషన్ ఆసక్తి కరంగా మారింది.






