7 దశాబ్దాల నాటి భూవివాదానికి తెర: చారిత్రక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు

by Naga Rani Yarlagadda |

సుమారు 74 ఏళ్లుగా నాలుగు తరాలను పట్టి పీడిస్తోన్న సుదీర్ఘ భూ వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది.

7 దశాబ్దాల నాటి భూవివాదానికి తెర: చారిత్రక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: సుమారు 74 ఏళ్లుగా నాలుగు తరాలను పట్టి పీడిస్తోన్న సుదీర్ఘ భూ వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. 1957లో జరిగిన ఒక భూ విక్రయ ఒప్పందాన్ని సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తుల వయసుకంటే.. చట్టపరంగా జరుగుతున్న ఈ భూ పోరాటం వయసే ఎక్కువ కావడం గమనార్హం. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్ వి అంజారియాలతో కూడిన ధర్మాసనం.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లా నర్సిపూర్ కలాన్ గ్రామంలో ఉన్న 15.5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంపై కీలక తీర్పును వెలువరించింది. 1957 జూన్ 4న నమోదైన అమ్మకపు రిజిస్ట్రేషన్ పత్రం చెల్లుబాటు అవుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో నాలుగు తరాలుగా ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న భూ వివాదానికి పరిష్కారం లభించినట్లయింది.

అసలు వివాదం ఏంటంటే..

1957లో నమోదైన సేల్ డీడ్ ద్వారా అప్పీలుదారుల పూర్వీకులు అప్పట్లో మైనర్లుగా ఉన్న సమయంలోనే 15.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచీ ఆ భూమిని తామే సాగుచేస్తూ వస్తున్నారు. 1984లో భూమిని తమ పేర్లపై మ్యూటేషన్ కూడా చేయించుకున్నారు. 1991లో భూ సమీకరణ.. అంటే కన్సాలిడేషన్ ప్రక్రియలో తమకు భూమిధార్ హక్కులు గుర్తించాలని కోరగా.. తొలుత కన్సాలిడేషన్ అధికారి వారి వాదనను అంగీకరించారు. అనంతరం ఇతర సహ యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేసు విచారణకు వచ్చింది. 1999లో కన్సాలిడేషన్ అధికారి సేల్ డీడ్ సక్రమంగా నిరూపించలేదని, అలాగే ఉత్తరప్రదేశ్ జమీందారీ నిర్మూలన, భూ సంస్కరణల చట్టంలోని సెక్షన్ 154ను ఉల్లంఘించిందని పేర్కొంటూ వారి అభ్యర్థనను తిరస్కరించారు. అప్పీల్, రివిజన్ అధికారులతో పాటు హైకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది.

కేవలం సాక్షి చిరునామాలో ఉన్న చిన్నపాటి వ్యత్యాసాన్ని ఆధారంగా తీసుకుని నమోదైన సేల్ డీడ్ ను తిరస్కరించడం తీవ్రమైన న్యాయపరమైన పొరపాటు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సేల్ డీడ్ నకిలీదని, మోసం, బెదిరింపు లేదా బలవంతం ద్వారా తీసుకున్నదని ప్రతివాదులు ఎక్కడా ఆరోపించలేదని కోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధంగా నమోదైన రిజిస్ట్రేషన్ పత్రానికి చిన్నపాటి సాంకేతిక లోపాల్ని చూపించి కొట్టివేయమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనిపై దిగువ కోర్టులు, కన్సాలిడేషన్ అధికారులు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని రద్దు చేస్తూ 1957 సేల్ డీడ్ ను చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది.

Next Story