Supreme court: వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దు.. హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన

by B.Srinivas |

రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ విలువైన హక్కు అని, కాబట్టి వ్యక్తి స్వేచ్ఛలో తేలికగా జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులకు సూచించింది.

Supreme court: వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దు.. హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ విలువైన హక్కు అని, కాబట్టి వ్యక్తి స్వేచ్ఛలో తేలికగా జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులకు సూచించింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఓ హత్యాయత్నం కేసులో నిందితుడికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు (Himachal Pradesh High court) ఈ ఏడాది జనవరి 3న ఇచ్చిన ఉత్తర్వును జస్టిస్ దీపాంకర్ దత్తా (Deepankar datha), మన్మోహన్‌ (Manmohan)లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. బెయిల్ తర్వాత నిందితుడి ప్రవర్తన అతని స్వేచ్ఛను హరించేలా ఉందని చూపించే ఆధారాలు లేనందున, బెయిల్‌ను రద్దు చేయడానికి హైకోర్టు వద్ద సరైన కారణం లేదని తెలిపింది.

నిందితుడు సాక్షులను ప్రభావితం చేసినట్టు, బెదిరించినట్లు, సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఎటువంటి ఆరోపణలు లేవని పేర్కొంది. బెయిల్ రద్దు చేసే ముందు హైకోర్టు సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. పిటిషనర్ బెయిల్‌ను రద్దు చేయడంలో హైకోర్టు పూర్తిగా తప్పు చేసిందని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రకారం ఒక విలువైన హక్కు అని, అందులో జోక్యం చేసుకునే ముందు కోర్టులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు 2024 ఆగస్టు28న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును పునరుద్దరించింది.

Next Story