నేతాజీ INA వల్లే స్వాతంత్య్రం అంటూ పిల్.. సుప్రీంకోర్టు సీరియస్

by Prasad Jukanti |

నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ వల్లే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని దాఖలైన పిల్‍ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నేతాజీ INA వల్లే స్వాతంత్య్రం అంటూ పిల్.. సుప్రీంకోర్టు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) వల్లే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు కొట్టివేసింది. భవిష్యత్తులో ఇలాంటి నిరాధారమైన వ్యాజ్యాలు దాఖలు చేస్తే సుప్రీంకోర్టులోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని పిటిషనర్‍ను హెచ్చరించింది. దేశానికి స్వాతంత్య్రం రావడంలో నేతాజీ నేతృత్వంలోని ఐఎన్ఏదే కీలక పాత్ర అని ప్రకటించడంతో పాటు నేతాజీని జాతీయ పుత్రుడిగా (National Son) గుర్తించి INA వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబర్ 21ను, నేతాజీ జయంతి జనవరి 23ను జాతీయ దినోత్సవాలుగా ప్రకటించాలని పినాక్పాణి మొహంతి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

నిర్ణయం ప్రభుత్వానిదే:

ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఇదే అంశంపై గతంలో కూడా సదరు వ్యక్తి పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడే దానిని కోర్టు కొట్టివేసిందని విచారణ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి విషయాలు న్యాయ సమీక్షా పరిధిలోకి రావని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారుల వద్దే వీటిని లేవనెత్తాలని గతంలోనే స్పష్టం చేసినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ మళ్లీ అదే అంశంపై పిటిషన్ దాఖలు చేయడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారని మండిపడింది.

పిటిషన్లు స్వీకరించవద్దు:

పిటిషనర్ వైఖరిపై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందిస్తూ ఇక అక్కడి నుండి వెళ్లండి లేదంటే భారీ జరిమానా విధిస్తా అని హెచ్చరించారు. అలాగే ఇలాంటి అంశాలపై సదరు పిటిషనర్ భవిష్యత్తులో పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని స్వీకరించవద్దని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

Next Story