Supreme court: బెయిల్ పొందిన వ్యక్తిని రిలీజ్ చేయడంలో జాప్యం.. యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

by B.Srinivas |

కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఓ వ్యక్తిని జైలు నుంచి విడుదల చేయడంలో జాప్యం చేసినందుకుగాను సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme court: బెయిల్ పొందిన వ్యక్తిని రిలీజ్ చేయడంలో జాప్యం.. యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఓ వ్యక్తిని జైలు నుంచి విడుదల చేయడంలో జాప్యం చేసినందుకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని జైలు అధికారుల తీరుపై మండిపడింది. అంతేగాక బెయిల్ పొందిన నిందితుడికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తులు కేవీ విశ్వనాథన్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మతమార్పిడి నిరోధక చట్టం కింద అరెస్టై జైలులో ఉన్న ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న బెయిల్ మంజూరు చేసింది. మే 27న ఘజియాబాద్‌లోని ట్రయల్ కోర్టు సైతం ఆయనను విడుదల చేయాలని జైలు అధికారులను ఆదేశించింది.

అయితే నిందితుడిని విడుదల చేయడంలో అధికారులు జాప్యం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 24న ఘజియాబాద్ జైలు నుంచి రిలీజ్ చేశారు. దీంతో బెయిల్‌ మంజూరైనప్పటికీ తన విడుదలలో ఆలస్యం చేసినందుకు గాను ఆ వ్యక్తి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు అధికారులపై ఫైర్ అయింది. అధికారులను ఎందుకు అప్రమత్తం చేయలేదని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ ఎదుట హాజరైన యూపీ జైళ్ల డైరెక్టర్‌ను ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ అనేది విలువైన హక్కు అని వ్యాఖ్యానించింది. ఆ వ్యక్తికి ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి తమకు నివేదిక అందజేయాలని డిస్ట్రిక్ సెషన్స్ జడ్జికి ఆర్డర్స్ ఇచ్చింది.

Next Story