వ్యాక్సీన్ వేసి వదిలేయండి..వీధికుక్కల అంశంపై జంతు ప్రేమికులకు ఊరట!

by Phanindra |

వీధికుక్కల అంశంపై జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. శునకాలకు వ్యాక్సీన్ వేసి వదిలేయాలని సూచించింది.

వ్యాక్సీన్ వేసి వదిలేయండి..వీధికుక్కల అంశంపై జంతు ప్రేమికులకు ఊరట!
X

దిశ, నేషనల్ బ్యూరో: జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు కొంత ఊరటనిచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వీధి కుక్కలను వెంటనే తొలగించాలని ఆగస్టు 8న ఇచ్చిన తీర్పును కొంత సడలించింది. ఈ తీర్పుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చి, జంతు ప్రేమికులు రోడ్లెక్కి నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. శుక్రవారం నాడు తీర్పును వెలువరించింది. పట్టుకున్న శునకాలకు వ్యాక్సీన్లు ఇచ్చి, డీవర్మింగ్ చేసిన అనంతరం వాటిని మళ్లీ వీధుల్లో వదిలేయాలని సూచించింది.

అయితే రేబీస్ సోకిన శునకాలు, పిచ్చికుక్కలను మాత్రం వదలొద్దని తెలిపింది. ఈ నిర్ణయం పట్ల రాహుల్ గాంధీ, మేనకా గాంధీ వంటి రాజకీయ నేతలు, పలువురు సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు, జంతు ప్రేమికులు హర్షం వ్యక్తంచేశారు. ‘వీధి కుక్కలను విడుదల చేయొద్దనే తీర్పుపై స్టే కొనసాగుతుంది. డీవర్మింగ్ (శరీరాల్లోని పురుగులను తొలగించడం), వాక్సినేషన్ తర్వాత ఎక్కడి నుంచి కుక్కలకు తీసుకెళ్లారో అక్కడే వదిలేయాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

అయితే పబ్లిక్ ప్లేసుల్లో ఈ శునకాలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించింది. దీని కోసం ప్రతి వార్డులో ప్రత్యేకమైన ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఆగస్టు 8న ఇచ్చిన తీర్పు మరీ కఠినంగా ఉందన్న జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ కేసులో పార్టీలుగా చేర్చింది. ఈ విషయంలో ఒక జాతీయ విధానాన్ని రూపొందించే ఆలోచనతో దేశవ్యాప్తంగా వీధికుక్కల అంశంపై ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసుకొంది.

కోర్టుకెక్కిన వాళ్లు డబ్బులు కట్టాల్సిందే..

ఈ వీధికుక్కల అంశంపై కోర్టుకెక్కిన ఎన్జీవోలు, జంతు ప్రేమికులు.. శునకాల సంక్షేమం కోసం డబ్బులు చెల్లించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్జీవోలు రూ.2 లక్షలు, వ్యక్తులు రూ.25 వేలు చొప్పున వారం రోజుల్లోగా కోర్టు రిజిస్ట్రీకి చెల్లించాలని తెలిపింది. ఈ డబ్బుతో శునకాల సంక్షేమానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. సొమ్ము చెల్లించని వారు ఇకపై ఈ విషయంలో జరిగే విచారణలో పాల్గొనడం కుదరదని తేల్చిచెప్పింది. కేవలం కేసు వేసిన ఎన్జీవోలు, ఆగస్టు 8న ఇచ్చిన తీర్పును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు మాత్రమే ఈ ఫైన్‌లు చెల్లించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. సామాన్యులపై ఈ తీర్పు వర్తించదని స్పష్టంచేశారు.

Next Story