భార్యకు గౌరవంగా జీవించే హక్కుంది.. పశువులా చూడకండి : సుప్రీంకోర్టు

by Naga Rani Yarlagadda |

భార్యను జంతువులా చూసే హక్కు భర్తకు లేదని, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమె బానిస కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

భార్యకు గౌరవంగా జీవించే హక్కుంది.. పశువులా చూడకండి : సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యను జంతువులా చూసే హక్కు భర్తకు లేదని, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమె బానిస కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. భార్యకు కూడా ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉందని తెలిపింది. గృహ హింస కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాట్నా హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది.

న్యాయమూర్తులు అరవింద్ కుమార్, పి.బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. నిందితుడు తన మొదటి భార్యపై మద్యం మత్తులో దాడి చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆమెను నేలపైకి నెట్టివేయడంతో తలకు ఇటుక తగిలిందని, ఆ తర్వాత కర్రతో దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా.. నిందితుడికి మొత్తం మూడు పెళ్లిళ్లయ్యాయని, దాడి తర్వాత బాధితురాలికి ఎటువంటి ఆర్థిక సాయం అందించలేదని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. అయితే.. సదరు మహిళతో తనకు పెళ్లే కాలేదని నిందితుడు వాదించాడు.

కోర్టు ఘాటు వ్యాఖ్యలు..

విచారణ సందర్భంగా జస్టిస్ వరాలే స్పందిస్తూ.. భార్య పట్ల ఈ విధంగా ప్రవర్తించడానికి ఎటువంటి సమర్థన లేదన్నారు. "భార్యను జంతువులా చూడాల్సిన అవసరం లేదు" అని ఆయన మండిపడ్డారు. జస్టిస్ కుమార్ కూడా నిందితుడి ప్రవర్తనను ప్రశ్నించారు. "మీరు భార్యను ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్ళండి" అని సూచించారు. నిందితుడికి ముగ్గురు భార్యలు ఉన్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. మీరు ఇలాగే కొడితే ఇప్పుడున్న భార్య కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అని వ్యాఖ్యానించారు.

లీగల్ ఎయిడ్ కార్యక్రమాల ద్వారా తమకు ఎదురైన అనుభవాలను జస్టిస్ కుమార్ ఈ సందర్భంగా పంచుకున్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే గృహ హింస కేసుల్లో మద్యం సేవించడం, ఆ తర్వాత భార్యలపై దాడి చేయడం అనేది ఒక సాధారణ పద్ధతిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "చాలా కేసుల్లో మహిళలు తమ భర్తలు మద్యం సేవించడాన్ని అభ్యంతరం చెప్పడం లేదు కానీ, తాగిన తర్వాత తమపై దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు" అని జడ్జి పేర్కొన్నారు. నిందితుడిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది.

Next Story