- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది ముమ్మాటికి కుట్రే NCERT పై సుప్రీం సీరియస్.. వివాదాస్పద పుస్తకం బ్యాన్
న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని NCERT పాఠ్యపుస్తకంలో చేర్చడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇవాళ నోటీసులు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం చేర్చడాన్ని సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఈ పాఠ్యాంశం న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనని సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా సీజేఐ తీవ్రంగా స్పందించారు. మీరు కాల్పులు జరిపారు, న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది. న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోందని, దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని కేటాయించిన ఎన్‍సీఈఆర్‍టీ కోర్టుల విశిష్ట చరిత్రను మాత్రం విస్మరించిందని మండిపడ్డారు. జవాబుదారీతనం ఏర్పడే వరకు ఈ వ్యవహారాన్ని మేము వదిలిపెట్టబోమన్నారు. ఈ సందర్భంగా కోర్టు ఐదు ఆదేశాలు జారీ చేసింది. వీటిని అతిక్రమిస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సుప్రీంకోర్టు జారీ చేసిన 5 ప్రధాన ఆదేశాలు:
* వివాదాస్పదమైన 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకానికి సంబంధించిన అన్ని హార్డ్ కాపీలను (పుస్తకాలను), డిజిటల్ వెర్షన్లను తక్షణమే మార్కెట్ నుండి, పాఠశాలలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలి.
*పుస్తకాల స్వాధీనం మరియు నివేదిక: ఇప్పటికే పంపిణీ అయిన అన్ని పుస్తకాలను స్వాధీనం చేసుకోవాలని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ కు ఆదేశం
*ఒకవేళ ఎక్కడైనా ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నా ఉపాధ్యాయులు వాటిని ఉపయోగించి పాఠాలు బోధించకూడదు. భౌతిక లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ కంటెంట్‌ను ప్రచారం చేయకూడదు
*ఈ పుస్తకానికి సంబంధించిన ముద్రణను, పంపిణీని పూర్తిగా నిలిపివేయాలి.
* ఆ వివాదాస్పద పాఠ్యాంశాన్ని రూపొందించిన నేషనల్ సిలబీ బోర్డ్ సభ్యుల పేర్లు, వారి అర్హతలు, ఆ చాప్టర్‌ను ఆమోదించిన సమావేశం తాలూకు అసలు మినిట్స్ (చర్చా పత్రాలు) కోర్టు ముందు ఉంచాలి
నోటీసులు జారీ:
ఈ అంశానికి బాధ్యులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఆదేశిస్తూ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, ఎన్‍సీఈఆర్‍టీ చైర్మన్‍కు ఈ సందర్భంగా ధర్మాసనం నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరపాలంటూ తదుపరి విచారణ వచ్చే నెల 11కు వాయిదా వేసింది. కాగా ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ఎన్‍సీఈఆర్‍టీ క్షమాపణలు చెప్పింది. కారణమైన వారిని కనిపెడతామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.






