- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధార్‌ను పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేము: సుప్రీంకోర్టు
ఆధార్‌ను పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆధార్ కార్డును పౌరసత్వానికి రుజువుగా స్వీకరించలేమనే ఎన్నికల సంఘం విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. బిహార్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్‌పై నమోదైన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నతన న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆధార్‌ను పౌరసత్వానికి నిదర్శనంగా స్వీకరించలేమనే ఈసీ వాదన సరైనదే. ఈ వివరాలను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తెలిపింది.
అసలు పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఈసీకి ఉన్నదా అని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వేసిన ప్రశ్నపై కూడా జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘వాళ్లకు ఆ అధికారం లేకపోతే అంతా ముగిసిపోతుంది. కానీ వాళ్లకు ఆ అధికారం ఉంటే అసలు సమస్యే లేదు కదా’ అని ఆయన అన్నారు. అలాగే ఎస్ఐఆర్ ద్వారా 65 లక్షల మంది ఓటర్లను తొలగించారని, సంప్రదాయంగా కాంగ్రెస్ ఓటర్లయిన అట్టడుగు వర్గం ప్రజలను ఈ జాబితా నుంచి తొలగిస్తున్నారని సిబల్ వాదించారు.
మరో అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ కూడా సిబల్ వాదనను బలపరిచారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి వివరాలను ఈసీ ఎక్కడా వెల్లడించలేదని ఆయన ఆరోపించారు. ఈ వివరాలను బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇచ్చామని, ఇంకెవరికీ ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని ఈసీ అంటోందని చెప్పారు.
ఓటర్ తన పత్రాలను సమర్పించినప్పుడు వాటిని ధ్రువీకరించాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుందని, అలాగే జాబితా నుంచి తొలగించిన వారికి సమాచారం అందించారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో ఒకవేళ ఎస్ఐఆర్ ప్రక్రియ అక్రమంగా జరిగిందని భావిస్తూ సెప్టెంబరులోపు దాన్ని పక్కన పెట్టేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.






