ముస్లిం లీగ్‌కు మద్దతు: సెక్యులరిజంపై కేరళం CM కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కేరళం కాబోయే ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తన మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)కు మద్దతుగా గళమెత్తారు.

ముస్లిం లీగ్‌కు మద్దతు: సెక్యులరిజంపై కేరళం CM కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళం కాబోయే ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తన మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)కు మద్దతుగా గళమెత్తారు. బీజేపీ చేస్తున్న విద్వేషపూరిత ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేరళంలో లౌకిక విలువల విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కేరళం ముఖ్యమంత్రిగా సతీశన్ ఎంపిక కావడం వెనుక ముస్లిం లీగ్, జమాత్-ఏ-ఇస్లామీల పాత్ర, ప్రభావం ఉందని బీజేపీ విమర్శించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

తీవ్రవాద శక్తులకు తావు లేదు..

‘ముస్లిం లీగ్ యూడీఎఫ్ కూటమిలో ఒక ముఖ్యమైన భాగస్వామి. ఆ పార్టీని బలహీనపరిస్తే, ఆ ఖాళీని తీవ్రవాద శక్తులు ఆక్రమించే ప్రమాదం ఉంది. మాజీ ముఖ్యమంత్రి కే.కరుణాకరన్ కాలం నుంచి ముస్లిం లీగ్ కాంగ్రెస్ వెంటే ఉంది’ అని సతీశన్ గుర్తుచేశారు. కేరళంను విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తాము అనుమతించబోమని తాయన హెచ్చరించారు. భావితరాలు సామరస్యంతో జీవించాలి. ఆ స్ఫూర్తిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా తాము ప్రాణాలకు తెగించి అడ్డుకుంటాం అని సతీశన్ కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపైనా సతీశన్ స్పందించారు. తనను వ్యక్తిగతంగా అందరూ ఇష్టపడకపోవచ్చు. నాలోని తప్పులను నేను తప్పకుండా సరిదిద్దుకుంటాను. కానీ మత విద్వేషాలను మాత్రం వ్యాపింపజేయనివ్వను అని ఆయన అన్నారు. కాగా, 140 స్థానాలు ఉన్న కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల వంటి పెద్ద పెద్ద నేతలు పోటీ పడగా, సతీశన్ వైపు హైకమాండ్ మొగ్గుచూపింది. కేరళం ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది.

Next Story