- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CBSEని సమర్ధించండి.. పాఠశాలలకు బోర్డు టూల్ కిట్స్! నెటిజన్ల ఫైర్
సీబీఎస్ఈ ఓఎస్‌ఎం మూల్యాంకన వివాదం తీవ్ర రూపం దాల్చింది. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు స్కూళ్లకు టూల్‌కిట్ పంపినట్లు ఆరోపణలు రావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానంలో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదానికి బాధ్యత నాదే అని స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించగా విపక్షాలు మాత్రం ఈ పరిణామాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఓఎస్ఎం పద్ధతిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న తరుణంలో సీబీఎస్‍ఈ వ్యవహరిస్తున్న తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాస్పద ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని బహిరంగంగా సమర్థించాలంటూ CBSE తమ బోర్డు పరిధిలోని పాఠశాలల ప్రిన్సిపాల్స్ కు ఒక 'సోషల్ మీడియా టూల్‌కిట్'ను పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా పలువురు ప్రిన్సిపాల్స్ ఈ విధానాన్ని సమర్థిస్తూ చేసిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్‍గా మారింది.
‘మెటీరియల్ ఫర్ ప్రిన్సిపాల్స్’ పేరుతో స్క్రిప్టులు!
ఓఎస్ఎంను సమర్థిస్తూ ఏం వీడియోలో ఏం మాట్లాడాలో స్క్రిప్టులు, ముఖ్యమైన అంశాలు 'మెటీరియల్ ఫర్ ప్రిన్సిపాల్స్' (Material for Principals) పేరుతో టూల్ కిట్స్ చేరవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కొత్త విధానం (ఓఎస్ఎం) వల్ల తలెత్తిన సమస్యల పట్ల సీబిఎస్‌ఈ ఎంతో చొరవతో, సానుభూతితో స్పందిస్తోందని చెప్పాలని అందులో కోరినట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున సాంకేతికతను అమలు చేస్తున్న క్రమంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు రావడం సహజం అని దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దని, సాంకేతిక లోపాల వల్ల ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా చూస్తామంటూ హామీ ఇస్తున్నట్లు ఈ మెటీరియల్ రూపంలో చెప్పిస్తున్నారు. చాలా స్కూల్స్ ఈ టూల్ కిట్స్ పై వీడియోలు చేసి తమ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. OSM వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, మానసిక వేదన మాకు తెలుసు. మా రీజనల్ ఆఫీస్ హెడ్ ఈ టూల్‌కిట్ పంపినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేను దానికి మద్దతుగా ఎలాంటి వీడియో చేయలేదని స్పష్టం చేస్తున్నాయి.
నెటిజన్ల ఆగ్రహం:
సీబీఎస్ఈకి వత్తాసు పలుకుతూ పలువురు ప్రిన్సిపాల్స్, విద్యార్థులు చేస్తున్న వీడియోలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ వైపు లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే మరో వైపు సీబీఎస్ఈ తమ తప్పులను అంగీకరించకుండా ఇలా సమర్ధించుకునేలా వీడియోలు చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పాఠశాలలను, విద్యా వ్యవస్థను ఒక ప్రభుత్వ విభాగానికి లేదా బోర్డుకు సంబంధించిన పీఆర్ (PR - Public Relations) ఏజెన్సీలుగా వాడుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా పీక్స్ కు చేరుకుంటున్న తరుణంలో ఈ టూల్ కిట్ అంశం ఈ ఇష్యూను ఎటువైపు తీసుకువెళ్తుందో చూడాలి మరి.






