Sunak: ఉద్యోగ బాట పట్టిన రిషి సునాక్.. ఆ సంస్థలో సీనియర్ సలహాదారుడిగా నియామకం

by B.Srinivas |

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తన రాజకీయ జీవితానికి తాత్కాలికంగా స్వస్తి పలికి మళ్లీ ఉద్యోగ బాట పట్టారు.

Sunak: ఉద్యోగ బాట పట్టిన రిషి సునాక్.. ఆ సంస్థలో సీనియర్ సలహాదారుడిగా నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi sunak) తన రాజకీయ జీవితానికి తాత్కాలికంగా స్వస్తి పలికి మళ్లీ ఉద్యోగ బాట పట్టారు. తను మొదట్లో పని చేసిన సంస్థ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్‌మన్ శాచ్స్‌లో సీనియర్ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ గోల్డ్ మన్ శాచ్స్ మంగళవారం వెల్లడించారు. ‘గోల్డ్‌మన్ శాచ్స్‌లో రిషిని సీనియర్ సలహాదారుగా స్వాగతించడానికి నేను సంతోషిస్తున్నా. భౌగోళిక రాజకీయ, ఆర్థిక సమస్యలపై తమ క్లయింట్‌లకు సలహా ఇవ్వడానికి సునాక్ గోల్డ్‌మన్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి పని చేస్తారు. ఆయన అనుభవం సంస్థకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్‌మన్ శాచ్స్‌ బృందాలతో సునాక్ సమయం గడుపుతారని, కంపెనీ మరింత అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు.

కాగా, భారత సంతతికి చెందిన రిషి సునాక్ 2022 అక్టోబర్ నుంచి 2024 జూలై వరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి తర్వాత ఆయన పీఎం పదవికి, పార్టీ నాయకుడి పదవికి రిజైన్ చేశారు. ప్రస్తుతం రిచ్ మండ్ ఎంపీగానూ కొనసాగున్నా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన 2001 నుంచి 2004 వరకు గోల్డ్ మన్ శాచ్స్‌లోనే విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే మళ్లీ అదే సంస్థలో సీనియర్ అడ్వైజర్ గా నియామకమవడం గమనార్హం. అయితే గోల్డ్‌మన్ శాచ్స్‌లో సంపాదించిన మొత్తం ఆదాయాన్ని ఆయన భార్య ప్రారంభించిన చారిటీ ‘ది రిచ్‌మండ్ ప్రాజెక్ట్‌’కు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Next Story