ప్రపంచంలోనే భారీ శాంతా క్లాజ్ సైకత శిల్పం.. వరల్డ్ రికార్డు సాధించిన సుదర్శన్ పట్నాయక్

by Ramesh Naini |

క్రిస్మస్ పండుగను దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ప్రపంచంలోనే భారీ శాంతా క్లాజ్ సైకత శిల్పం.. వరల్డ్ రికార్డు సాధించిన సుదర్శన్ పట్నాయక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రిస్మస్ పండుగను దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, అలంకరణలు, కేక్ కటింగ్‌లు, సామూహిక కార్యక్రమాలతో ఏసు ప్రభువు జననాన్ని ఆనందంగా వేడుక చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రేమ, శాంతి, సేవ సందేశాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్ సైకత శిల్పాన్ని రూపొందించి.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. గురువారం ఒడిశాలోని పూరీ నీలాద్రి బీచ్‌లో ఆయన ఈ విశిష్ట సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. ఇసుకతో పాటు 1.5 టన్నుల ఆపిల్ పండ్లను వినియోగించి రూపొందించిన ఈ శిల్పం ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్ సైకత శిల్పంగా వరల్డ్ రికార్డు సాధించింది.

30 మంది విద్యార్థుల సహకారంతో రూపొందిన ఈ శిల్పం 60 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 22 అడుగుల ఎత్తుతో ఆకట్టుకుంటోంది. శాంతాక్లాజ్‌ను జీవంతంగా ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కళాఖండం శాంతి, ఐక్యత సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా రూపొందించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ఈ సంస్థాపనను వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించడంతో పట్నాయక్‌కు మరో ఘనత దక్కింది. ఆయన కళా ప్రతిభకు ఇది మరో మైలురాయిగా కళాభిమానులు ప్రశంసలు కురిపించారు.

Next Story