Student: నేలపై పడేసి, చేతులకు సంకెళ్లు వేసి.. అమెరికాలో భారత విద్యార్థిపై అమానుషం

by B.Srinivas |

అమెరికాలోని న్యూజెర్సీ న్యూవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ భారతీయ విద్యార్థి పట్ల అధికారులు అమానుషంగా ప్రవర్తించారు.

Student: నేలపై పడేసి, చేతులకు సంకెళ్లు వేసి.. అమెరికాలో భారత విద్యార్థిపై అమానుషం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని న్యూజెర్సీ న్యూవార్క్ లిబర్టి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (International Airport) లో ఓ భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో విద్యార్థిని నేలపై పడేసి, ఆపై చేతులకు సంకెళ్లు వేసి ఇండియాకు తిప్పిపంపారు. స్డూడెంట్ ఏడుస్తున్నా ఆఫీసర్స్ ఏ మాత్రం కనికరించలేదు. కునాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్‌లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరు తనను ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. ‘న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక యువ భారతీయ విద్యార్థి చేతులకు సంకెళ్లు వేసి, నేరస్థుడిలా ప్రవర్తించడం నేను చూశాను. ఆయన తన కలలను వెంబడిస్తూ అమెరికాకు వచ్చాడు. అంతేగానీ ఎవరికీ హాని కలిగించడానికి రాలేదు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించింది. ప్రతిరోజూ ఇలాంటి కేసులు జరుగుతున్నాయి. ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

Next Story