మహారాష్ట్రలో వింత రాజకీయం: రెండు చోట్ల బీజేపీ-కాంగ్రెస్-ఎంఐఎం పొత్తు!

by Malleboina Mahesh |

రాజకీయంగా బద్దశత్రువులు అయిన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలో పొత్తు పెట్టుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నాయి.

మహారాష్ట్రలో వింత రాజకీయం: రెండు చోట్ల బీజేపీ-కాంగ్రెస్-ఎంఐఎం పొత్తు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల మహారాష్ట్రలో జరిగిన పలు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో రాజకీయంగా బద్దశత్రువులు అయిన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలో పొత్తు పెట్టుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ పరిణామాలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

కలిసికట్టుగా బద్ధ శత్రువులు.. శివసేనకు షాక్

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం (AIMIM) పార్టీలు రెండు మున్సిపల్ కౌన్సిళ్లలో పొత్తు పెట్టుకోవడం రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశంలో కలకలం రేపింది. ముఖ్యంగా అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో.. మిత్రపక్షమైన ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనను పక్కన పెట్టేందుకు బీజేపీ పావులు కదిపింది. అక్కడ కాంగ్రెస్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో జతకట్టి 'అంబర్‌నాథ్ వికాస్ అఘాడి' పేరుతో కూటమి కట్టి అధికార పీఠాన్ని దక్కించుకుంది.

సీఎం ఫడ్నవీస్ సీరియస్

ఈ స్థానిక పొత్తులపై ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ అగ్రనేత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై స్పందిస్తూ.. "ఇలాంటి పొత్తులకు పార్టీ నాయకత్వం ఆమోదం లేదు. ఇది ముమ్మాటికీ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే" అని మండిపడ్డారు. మరోవైపు, బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ చర్యను "సంకీర్ణ ధర్మానికి విద్రోహం" (Betrayal of coalition dharma) అని విమర్శించింది.

12 మంది కౌన్సిలర్లపై కాంగ్రెస్ వేటు సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీతో చేతులు కలిపినందుకు కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పొత్తు పెట్టుకున్న 12 మంది కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అధికారమే లక్ష్యంగా స్థానిక నేతలు తీసుకున్న ఈ నిర్ణయం అటు అధికార పక్షంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ ప్రకంపనలు సృష్టించింది.

Next Story