"గాజులు తొడుక్కున్నావా.. అమ్మాయిలా ఏడవొద్దు" పదాలకు స్వస్తి పలకాలి: మంత్రి లోకేశ్

by Naga Rani Yarlagadda |

అమ్మాయిలు, మహిళలను చిన్నచూపు చూసే పదాలను ఇకనైనా వాడటం మానాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

గాజులు తొడుక్కున్నావా.. అమ్మాయిలా ఏడవొద్దు పదాలకు స్వస్తి పలకాలి: మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో నైతిక విలువలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలో మహిళల పట్ల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కర్ణాటకలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలుగు వాడుక భాషలో మహిళలను తక్కువ చేసి మాట్లాడే సంస్కృతికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. తెలుగు సమాజంలో తెలియకుండానే మహిళలను అవమానించేలా కొన్ని పదబంధాలు వాడుకలోకి వచ్చాయని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. "గాజులు తొడుక్కున్నావా?".. "అమ్మాయిలా ఏడవద్దు.." వంటి పదాలు మహిళల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపేలా ఉన్నాయని, ఇలాంటి విమర్శలకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో వారిని బలహీనులుగా చిత్రించడం సరికాదని హితవు పలికారు.

చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలు

ప్రభుత్వ పరంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించుకున్న విషయాన్ని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే సంస్కారవంతమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో పిల్లలకు చెప్పిన ఒక ముఖ్యమైన ప్రవచనాన్ని లోకేశ్ ఉదహరించారు. "నువ్వు చేసే ఏ పనైనా నీ కన్న తల్లికి ధైర్యంగా చెప్పగలగాలి. నీ తల్లికి చెప్పలేని ఏ పనిని కూడా నువ్వు చేయకూడదు." ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉంటుందని, సమాజంలో నేరాలు తగ్గుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో ఆధ్యాత్మిక ప్రవచనాల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు.

Next Story