Stalin: ఆ నిర్ణయాన్ని ఉమ్మడిగా వ్యతిరేకించాలి.. ఎనిమిది రాష్ట్రాలకు స్టాలిన్ లేఖ

by B.Srinivas |

రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించేందుకు గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే.

Stalin: ఆ నిర్ణయాన్ని ఉమ్మడిగా వ్యతిరేకించాలి.. ఎనిమిది రాష్ట్రాలకు స్టాలిన్ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించేందుకు గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు (Suprme court) గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుపై రాష్ట్రపతి ముర్ము ప్రశ్నలు సంధించారు. దీనిపై గతంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) ఆదివారం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు లేఖ రాశారు. రాష్ట్రపతి చర్యలను ఉమ్మడిగా వ్యతిరేకించాలని కోరారు. దీనికి సంబంధించిన చట్టపరమైన వ్యూహాలను సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కేవలం తమిళనాడుకే పరిమితం కాబోదని, అన్ని రాష్ట్రాలకూ ఎంతో కీలకమైందని తెలిపారు. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును చెడగొట్టడానికి ప్రయత్నిస్తోంది. కుట్రలో భాగంగానే మొదట న్యాయస్థానం సూచన తీసుకోవాలని రాష్ట్రపతికి సూచించింది. ఇతర రాష్ట్రాలు సైతం గవర్నర్‌ను ఎదుర్కొన్నప్పుడు ఈ తీర్పును ఉదాహరణగా పరిగిణించొచ్చు. కాబట్టి బీజేపీ దీనిని అస్థిరపర్చేందుకు కుట్ర చేస్తోంది’ అని పేర్కొన్నారు.

‘ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పనితీరును అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను ఎలా ఉపయోగించుకుందో అందరికీ తెలుసు. బిల్లులకు ఆమోదం తెలపడంలో ఆలస్యం చేస్తారు లేదా చట్టపరమైన కారణాలు లేకుండా వాటిని నిలిపివేస్తారు. కీలక పదవులకు నియామకాలను అడ్డుకుంటారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల పదవులనూ దుర్వినియోగం చేస్తారు.అందుకే ఈ విషయంలో ఐక్యంగా పోరాడాలి’ అని తెలిపారు. స్టాలిన్ లేఖ రాసిన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు ఉన్నారు.

Next Story