Spain: యూరప్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ఆ దేశాల్లో నిలిచిన కీలక సేవలు

by B.Srinivas |

యూరోపియన్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో విద్యుత్ సరాఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Spain: యూరప్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ఆ దేశాల్లో నిలిచిన కీలక సేవలు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూరోపియన్ దేశాలైన స్పెయిన్ (Spain), పోర్చుగల్ (Portugal) , ఫ్రాన్స్‌ (France)లలో విద్యుత్ సరాఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఆయా దేశాల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా పలు కీలక సేవలు సైతం నిలిచిపోయాయి. మూడు దేశాల్లో మెట్రో, విమానాశ్రయం, రైలు, మొబైల్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలాగే ట్రాఫిక్ లైట్లు, ఏటీఎం మిషిన్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. లక్షలాది మంది ప్రజలు చీకటిలోనే ఉండాల్సి వచ్చింది. పోర్చుగల్, స్పెయిన్ రాజధానులలో అనేక మెట్రో రైళ్లు స్టేషన్ల మధ్య సొరంగాల్లో చిక్కుకున్నాయి. విద్యుత్ కోతలు ఆస్పత్రులను కూడా ప్రభావితం చేశాయి. దీంతో ప్రధాన ఆస్పత్రుల్లో పలు ఆపరేషన్లను రద్దు చేశారు. స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పూర్తిగా అంతరాయం ఏర్పడగా ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరెంట్ నిలిచింది.

అత్యవసర సమావేశం

విద్యుత్ సంక్షోభం తర్వాత స్పెయిన్, పోర్చుగల్ ప్రభుత్వాలు అత్యవసరంగా కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేశాయి. విద్యుత్ పరిస్థితిపై సమీక్షించాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపాయి. ఘటనపై విచారణ చేపట్టేందుకు స్పెయిన్‌లో ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. స్పెయిన్ విద్యుత్ గ్రిడ్ మేనేజర్ రెడ్ ఎలక్ట్రీకా స్పందిస్తూ.. ఉత్తర, దక్షిణ స్పెయిన్‌లో విద్యుత్ సరఫరాలను క్రమంగా పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఎప్పటి వరకు సాధారణ పరిస్థితి నెలకొంటుదని చెప్పలేమన్నారు.

సైబర్ దాడిగా అనుమానం!

విద్యుత్ సరఫరా ఆగిపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే యూరప్ విద్యుత్ గ్రిడ్‌లో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పలు కథనాలు వెల్లడించాయి. మరోవైపు సైబర్ దాడి జరిగే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని పలువురు భావిస్తున్నారు. యూరప్‌లోని ఇంధన నెట్‌వర్క్, దాని లోపాల పైనా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భారీ విద్యుత్ అంతరాయం వెనుక సైబర్ దాడి జరిగిందా లేదా అని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్పెయిన్ అధికారి ఒకరు తెలిపారు.

Next Story