మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు కలిసి ఒకే ఉపగ్రహంగా భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయని నారాయణన్ అన్నారు.

మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు
X

- ఇప్పటికే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలు

- మరోసారి డాకింగ్ ప్రక్రియ

- భవిష్యత్ ఇస్రో ప్రయోగాలకు కీలకం

- ఇస్రో చైర్మన్ వి.నారాయణన్

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మార్చి 15 నుంచి స్పేడెక్స్ (SpaDeX)మిషన్‌ను తిరిగి ప్రారంభించనుంది. ఇస్రో తన భవిష్యత్ ప్రాజెక్టుల కోసం సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ స్పేడెక్స్ మిషన్ చాలా కీలకంగా మారిందని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఇస్రో చేపట్టనున్న పలు ప్రయోగాల గురించి తెలిపారు. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను వేరే చేసి, మళ్లీ రీడాకింగ్ చేయడంపై ఇస్రో దృష్టి పెట్టినట్లు తెలిపారు. నిరుడు డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 అనే రెండు ఉపగ్రహాలను ప్రయోగించారు. స్పేస్ డాకింగ్ టెక్నాలజీని పరీక్షించడమే లక్ష్యంగా ఈ మిషన్ చేపట్టారు. అనేక ప్రయత్నాల తర్వాత జనవరి 16న ఇస్రో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేసింది.

ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు కలిసి ఒకే ఉపగ్రహంగా భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయని నారాయణన్ అన్నారు. అయితే స్పేడెక్స్ మిషన్‌కు సంబంధించి ప్రయోగాలు చేయడానికి ప్రతీ రెండు నెలలకు 10 నుంచి 15 రోజుల సమయం దొరుకుతుందని అన్నారు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నందు వల్ల కేవలం తక్కువ సమయం మాత్రమే ఇస్రో సైంటిస్టులకు లభిస్తుందని చెప్పారు. మార్చి 15 నుంచి రెండు ఉపగ్రహాతను వేరు చేసి.. తిరిగి డాకింగ్ చేసే ప్రయోగాలను చేపడతామని అన్నారు. అన్ డాకింగ్, రీడాకింగ్ కోసం మార్చి 15 నుంచి ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు నారాయణన్ చెప్పారు. రెండు ఉపగ్రహాల్లోనూ పుష్కలంగా ప్రొపెల్లెంట్ ఉన్నందున బహుళ ప్రయోగాలు చేయడానికి సాధ్యపడుతుందని అన్నారు. ఇక మూడో స్లాట్ కోసం కూడా మరి కొన్ని పరీక్షలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.

స్పేడెక్స్ మిషన్‌ను భవిష్యత్‌లో చేపట్టబోయే అనేక ప్రయోగాలకు నాందిగా భావిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. చంద్రయాన్-4, భారత్ అంతరిక్ష్ స్టేషన్ నిర్మాణం వంటి ప్రయోగాలకు అధునాతన డాకింగ్ సాంకేతిక అవసరం. అందుకే స్పేడెక్స్ మిషన్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్పారు. డాకింగ్, దృఢత్వ ప్రయోగాల తర్వాత రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్ బదిలీ ప్రయోగం కూడా చేపట్టడానికి ఇస్రో ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. కాగా, డిసెంబర్ 30న చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను ఇస్రో క్ష్యలోకి పంపి.. జనవరి 16న డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది.

Next Story