- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనాను వణికిస్తోన్న మరో వ్యాధి.. హై అలర్ట్ ?
చైనాలోని వుహాన్‌లో మొదలైన కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భయాందోళనలను సృష్టించిందో ప్రత్యేకంగా..

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని వుహాన్‌లో మొదలైన కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భయాందోళనలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా.. కోట్లాది మందిని ఉపాధి కోల్పోయేలా చేసింది. అప్పటి నుంచి, కొత్త వ్యాధుల మూలాలు చైనాకు సంబంధించినవిగానే కనిపిస్తున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనాలో మరో ప్రమాదకరమైన వ్యాధి చికున్‌గున్యా ప్రజలను బాధిస్తోంది. కోవిడ్ తర్వాత ఇది అత్యంత తీవ్రమైన వ్యాధిగా పరిగణించబడుతోంది. దక్షిణ చైనాలోని షెన్‌జెన్ సమీపంలోని ఫోషాన్ నగరంలో చికున్‌గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఫోషాన్‌లోని ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి, ఫలితంగా రోగులకు తగిన వసతులు కల్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, చికున్‌గున్యా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి సంబంధించి చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అప్రమత్తమై, ఫోషాన్‌లోని షుండే, నాన్‌హై జిల్లాల్లో శనివారం హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు తమ ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా వారాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
స్థానిక ఆరోగ్య అధికారుల ప్రకారం.. షుండేలో జూలై 8న తొలి చికున్‌గున్యా కేసు నమోదైంది. శుక్రవారం నాటికి షుండేలో మొత్తం 1,161 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం బీజియావో, లెకాంగ్, చెన్‌కున్ పట్టణాల్లో నమోదయ్యాయి. అలాగే.. నాన్‌హై జిల్లాలో 16 కేసులు, చాంచెంగ్ జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో హాంకాంగ్‌లో కూడా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్‌లో చివరిసారిగా 2019లో 11 చికున్‌గున్యా కేసులు, 2018లో 2, 2017లో 1, 2016లో 8 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.






